‘మా’లో ఊహించని పరిణామం..ప్రకాశ్‌రాజ్ టీం రాజీనామా!
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ‘మా‘(మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్)లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ టీం మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్ మీడియా ముందు పలు అంశాలను వెల్లడించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మందిలో ఉపాధ్యక్షుడు బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా ఉత్తేజ్, ఈసీ సభ్యులుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, సమీర్, సుడిగాలి సుధీర్, కౌశిక్‌లు ఉన్నారు. అయితే వీరందరూ మూవీ అసోసియేషన్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త అసోసియేషన్‌లో ఒకే ప్యానల్ సభ్యులు ఉంటే బాగుంటుందని, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు మా ప్యానల్ తరపున సపోర్టు ఉంటుందని, తాము మరో అసోసియేషన్ పెట్టడం లేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. అయితే ప్రకాశ్రాజతోపాటు ఆ ప్యానల్ సభ్యలు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తం చేశారు. మున్ముందు జరిగే పరిణామాలపై ప్రశ్నించాంటే.. ‘మా‘ అసోసియేషన్‌లో ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.