త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో చోటెవరికి ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనుందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రి వర్గంలో జోతిరాదిత్య సింథియా, శర్వానంద్ సోనోవాల్, వరుణ్ గాంధీ, భూపేంద్ర యాదవ్, సుశీల్ కుమార్ షిండే, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాంల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పాటు కర్నాటక నుంచి ప్రతాప్ సిన్హా పేరు వినిపిస్తోంది. లోక్ జనశక్తి పార్టీలో చీలిక తెచ్చిన పశుపతి పరాస్ పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జేడీయూ నుంచి లల్లాన్ సింగ్, సంతోష్ కుశ్వహా, రామ్ నాథ్ ఠాకూర్లను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ.. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. రెండో దశ మంత్రి వర్గ విస్తరణలో అటు తెలంగాణలో కానీ, ఇటు ఏపీలో కానీ ఎవరికీ చోటు దక్కే అవకాశంలేదని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక నుంచి మాత్రమే ప్రతాప్ సిన్హా పేరు వినిపిస్తోంది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరికీ కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.