హక్కుల కోసం.. ఐక్య పోరాటం..
1 min readడిమాండ్లు నెరవేర్చాల్సిందే…
ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకునేందుకు.. హక్కులు కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నామని ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ…విధులు నిర్వర్తించారు. జేఏసీ జిల్లా నాయకులు కలెక్టరేట్లోని జేసీ కార్యాలయం, ఐసీడీఎస్, ట్రెజరీ, డ్వామా, వ్యవసాయ, డీఈఓ, రెవెన్యూ తదితర శాఖల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలు ధరింపజేసి…నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సకాలంలో జీతాల చెల్లింపులు చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా గిరికుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉద్యమ కార్యాచరణ…:
ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోమానికి మద్దతుగా ఉద్యోగులతో చేయి చేయి కలుపుతూ జేఏసీ నాయకులు కార్యాలయాలను సందర్శిస్తారు.. అదేవిధంగా 20 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వర్కు టు రూల్, 27న కరోన సమయంలో చనిపోయి.. కారుణ్య నియామకాలు పొందని వారి కుటుంబాలకు పరామర్శిస్తారు. ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి వెల్లడించారు.