అకాల వర్షం..తీవ్ర పంట నష్టం
1 min read– భారీ వర్షంతో అల్లాడిపోతున్న రైతులు
– తడిసిన పండు మిర్చి.. నేలకొరిగిన మొక్కజొన్న పంట
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం లోని రోళ్లపాడు, జలకనూరు, తలముడిపి, చింతలపల్లి, చేరుకుచెర్ల, మిడుతూరు, గ్రామంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, పండు మిర్చి, బొప్పాయి, అరటి తోటలు పంటలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు అకాల వర్షంతో దెబ్బతిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కల్లాలలో ఆరబోసిన మిర్చి పూర్తిగా వర్షంతో తడిసిపోయిందని, పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాలంగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర నష్టపోయామని రైతులు భావోద్వేగానికి గురవుతున్నారు. మండలం నందు దెబ్బతిన్న పంటలను శుక్రవారం వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ శేఖర్, మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్ , మండల ఉద్యాన వ్యవసాయ అధికారి తేజస్విని , జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి లు పరిశీలించారు. పంటల వివరాలను నమోదు చేసుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ సహాయకులు గ్రామాలలో పర్యటించి ప్రాథమిక సర్వే చేసి పంట నష్టం అంచనా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అదికారులు రైతులకు తెలియజేశారు.