PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పశువుల యూనివర్సిటీలా మారిన ఉర్దూ యూనివర్సిటీ.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులో నిర్మాణంలో ఉన్న ఉర్దూ యూనివర్సిటీ పశువుల కోసం పెట్టిన యూనివర్సిటీలా తయారైందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగర శివారులోని ఉర్దూ యూనివర్సిటీని ఆయన పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ యూనివర్శిటీ నిర్మాణ పనులు జరగడం లేదన్నారు. ముస్లీంల కోసం కర్నూల్లో ఉర్దూ యూనివర్శిటీ ఉండాలని గతంలో తన తండ్రి టిజి వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో పోరాడారని.. అయితే రాష్ట్ర విభజన జరగడం.. ఆ తర్వాత తన తండ్రి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కర్నూలుకు ఉర్దూ యూనివర్శిటీ వచ్చేలా కృషి చేశారన్నారు. 144 ఎకరాల్లో ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తూ.. అందుకోసం మొదటి విడత క్రింద రూ.18 కోట్లను చంద్రబాబు విడుదల చేశారన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆ నిధులను ఏం చేశారో, ఎలా ఖర్చు పెట్టారో తెలియదన్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుండి ఈ యూనివర్శిటీని పట్టించుకున్న నాధుడే లేడన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి యూనివర్సిటీ నిర్మాణం కోసం రూ. 45 కోట్లు కేటాయిస్తూ జీ.వో విడుదల చేసినా డబ్బులు ఇంకా మంజూరు కాలేదన్నారు. రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే ఒక్క ఉర్దూ యూనివర్శిటీ ఇదని.. దీని విషయంలో ముస్లీంలకు జరిగింది శూన్యమన్నారు. ముస్లీంలు కూడా ఆలోచించాలని, ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పే వారిని ఎప్పటికీ నమ్మకండన్నారు. ప్రజల బాగు కోసం పోరాడే లీడర్ ఎవరో, ఎలాంటి ప్రభుత్వం ఉండాలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ముస్లీంలకు టిడిపి ప్రభుత్వంలో జరిగిన మేలు.. ఇంకే ప్రభుత్వంలో జరగలేదన్నారు. ఎంతో ముఖ్యమైన ఈ యూనివర్సిటీ రాత్రి సమయంలో పశువులు నివాసం ఉండేలా తయారైందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం బాధాకరమన్నారు. అంతేకాకుండా ఇప్పుడు తాత్కాలికంగా అద్దె భవనంలో నడిపిస్తున్న యూనివర్సిటీ కి అద్దె చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అద్దె భవనాలకు నిధులు చెల్లించాలని,. ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేసి పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని భరత్ కోరారు. ఇక్కడ యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక గత ఎన్నికల్లో తన తండ్రి గెలిచి ఉంటే ముస్లీంలకు ఎంతో ముఖ్యమైన హజ్ హౌస్ కర్నూల్లో ఉండేదని.. ఇప్పుడది కడపకు వెళ్లినా ఉపయోగంలో లేదని తెలిసిందన్నారు. ఈ విషయాలపై ముస్లీం సోదర సోదరీమణులు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మన్సూర్ ఆలీఖాన్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మహిళా విభాగం పార్లమెంట్ అధ్యక్షురాలు ముంతాజ్, నేతలు ఇబ్రహీం, మెహబూబ్ బాషా, నాయీమ్, గౌస్, రజాక్, రమీజ్, జియా, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

About Author