కృష్ణానుండి విడుదలవుతున్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే వినియోగించాలి..
1 min readకలిదిండి మండలంలో చెరువులకు నీటిని నింపే విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
అక్రమ నీటి వినియోగంపై పటిష్టమైన నిఘా ఉంచాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని అక్రమ నీటి వినియోగాన్ని నిరోధించేందుకు పటిష్టమైన నిఘావుంచాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కలిదిండిలో చెరువుకు నీటిని నింపే విధానాన్ని పరిశీలించారు. అనంతరం రెండు రోజుల్లో నీరు అందనున్న పోల్ రాజ్ కాల్వను ఆయన సందర్శించారు. కృష్ణానది నుంచి వస్తున్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. కృష్ణానీరు కైకలూరు నియోజవర్గంలో 158 చెరువుల్లో నీరు నింపేందుకు విడుదల చేసిన నీరు సక్రమంగా ఆయా చెరువులకు చేరవేసే విషయంలో రెవిన్యూ, పంచాయితీ, ఆర్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోను త్రాగునీటి అవసరాలకు మినహా అక్రమంగా పొలాలకు, చేపల, రొయ్యల చెరువులకు మళ్లింపు జరిగేందుకు ఎంతమాత్రం అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అనధికారికంగా మోటార్లద్వారా నీటిని తోడేందుకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కేవలం నూరుశాతం త్రాగునీటి అవసరాలకే కాల్వల నుండి వచ్చే నీరు ఉపయోగించాలన్నారు. కాల్వల నుంచి సరఫరా అయ్యే నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. క్యాంప్ బెల్ కాల్వకు సంబంధించి శివారు ప్రాంతాలకు నీరుచేరిన అనంతరం పై చెరువులకు నీటిని నింపడం ప్రారంభించడం జరిగిందన్నారు. దీనికింద 39 చెరువులకు నీటిని నింపే కార్యక్రమం ప్రారంభమయిందన్నారు. ప్రస్తుత మంచినీటి చెరువులు నింపే కార్యక్రమాన్ని పూర్తిస్ధాయిలో నిర్వహించాలని తిరిగి రెండు నెలల వరకు కాల్వల నుంచి నీరు విడుదల జరగదని ఈ దృష్ట్యా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కాల్వలకు నీరు విడుదలవుతున్న దృష్ట్యా పై నుండి కొట్టుకు వస్తున్న చెత్తా, చెదారాలను తక్షణమే తొలగించాలని ఇరిగేషన్, డ్వామా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్ధాయిలో ఉపాధిహామీ కింద తూడు తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలోని ఆగడాల లంక, చెట్టున్న పాడు, మల్లవరం గ్రామాల్లో మంచినీటి చెరువులకు గోదావరి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నీరు చేపల చెరువులకు మళ్లింపు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం మండలస్ధాయిలో బృందాలను నియమించాలన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాస్ధాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచినీటి కొరత, త్రాగునీటి ఎద్దడి వుంటే 9100121271 ఫోన్ నెంబరుకు తెలియజేయవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. కలెక్టర్ వెంట ఆర్ డబ్ల్యూ ఎస్ ఇ ఎన్. సత్యనారాయణ, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె. ఖాజావలి, ఇరిగేషన్, మత్స్య, తదితర శాఖల అధికారులు,ఉన్నారు.