ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్ పోర్ట్
1 min readప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
– ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడికి ఘననివాళి అర్పించిన సీఎం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రేనాటి వీరుడు..ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు నామకరణం చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించిన అనంతరం.. వేలాది మంది ప్రజల హర్షాతిధ్వనుల మధ్య సభావేదికపై ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్ పోర్ట్‌గా నామకరణం చేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ( గురువారం) ఈ రోజు అని, ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో న్యాయరాజధాని కర్నూలు తో ఇతర ప్రాంతాలకు విమానయానం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో… 6వ ఎయిర్పోర్ట్
2019 ఎన్నికల ముందు హడావుడిగా.. అసంపూర్తిగా ..ఎటువంటి డిజిసీఏ అనుమతులు లేకుండా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎద్దేవ చేసిన సీఎం వైఎస్ జగన్… రూ. 110 కోట్లను ఖర్చు పెట్టి ఒకటిన్నర సంవత్సరం లోపు యుద్ధప్రాతిపాదికన ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేశామని వెల్లడించారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టును రాష్ట్రంలో 6వ ఎయిర్ పోర్టుగా ప్రారంభించామని .. ఈ నెల 28 నుండి ఓర్వకల్ ఎయిర్ పోర్టు నుండి తొలి కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ మొదలవుతాయన్నారు.
జాతీయ జెండాకు.. వందనం..
అనంతరం.. కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఆ తరువాత ఓర్వకల్ విమానాశ్రయం వద్ద ఉన్న జాతీయ జెండాకు జెండా వందనం చేసిన సీఎం.. ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ భవనం ముందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎయిర్ పోర్ట్ ప్రారంభం..
డిపార్చర్ గేటు వద్ద రిబ్బన్ కటింగ్ చేసి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనంతరం, విమానాశ్రయం లోపల భవనాలను పరిశీలించారు. సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగి..ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు బయలు దేరి వెళ్లారు.