వ్యాక్సినే.. ఆయుధం
1 min read– కోవిడ్ నియంత్రణ.. అందరి బాధ్యత
– హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తప్పనిసరిగా వాక్సిన్
– వీసీలో కలెక్టర్లకు సూచించిన సీఎం వైఎస్ జగన్
అమరావతి: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వైరస్ నియంత్రణను ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైరస్ నియంత్రణకు వ్యాక్సినే ఆయుధమన్న సీఎం.. వ్యాక్సినేషన్‌ను వృథా చేయొద్దన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. వాక్సినేషన్ అనేది శాశ్వత పరిష్కారం. అయితే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ డోస్‌లు కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోస్‌లు తయారవుతున్నాయి. వాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదే. దీంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు వీలైనంత వరకు అందరికి వాక్సిన్ ఇవ్వడంతో పాటు, మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరి కట్టాల్సి ఉంది’.
వారి సేవలు ప్రశంసనీయం: కోవిడ్ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి. కోవిడ్ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పని చేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వచ్చింది’
పాజిటివ్.. రికవరీ: ‘రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 1.55 కోట్ల పరీక్షలు చేయగా 9.37 లక్షల కేసులు పాజిటివ్‌గా తేలాయి. పాజిటివిటీ రేటు 6.03 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. అదే సమయంలో దేశ సగటు చూస్తే రికవరీ రేటు 88.9 శాతం మాత్రమే. రాష్ట్రంలో టయర్–1 వంటి నగరాలు లేకపోయినా మనకున్న వసతులతో బాగా పని చేయగలిగాం. రాష్ట్రంలో మరణాల రేటు 0.78 శాతంగా ఉండగా, జాతీయ స్థాయిలో అది 1.24 శాతంగా ఉంది.
కోవిడ్ కేర్ సెంటర్లు: ‘ఇంట్లో ఐసొలేషన్ కోసం ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపించాలి. అక్కడ కూడా శానిటేషన్, మెడికేషన్, ఫుడ్ క్వాలిటీ, మందులు అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు చెక్ చేయడం కూడా మన బాధ్యత. రాష్ట్రంలో ఇప్పుడు 26 కోవిడ్ కేర్ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, మనం వాటి సంఖ్యను గత సెప్టెంబరు నాటితో చూస్తే, అంటే 50 వేల బెడ్లకు పెంచాల్సిన అవసరం ఉంది’.
హోం ఐసొలేషన్: హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి సంబంధించి.. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సర్వే ద్వారా కోవిడ్ కేసుల నిర్ధారణ చేసిన తర్వాత లేదా 104 కాల్ సెంటర్ తర్వాత కోవిడ్ కేసు గుర్తిస్తే, వెంటనే ఆ ఇంటిని మార్క్ చేసి, ఆ ఇంట్లోని రోగికి వెంటనే కోవిడ్ కిట్ ఇవ్వడంతో పాటు, రెగ్యులర్‌గా మానిటర్ చేయాలి. మూడు రోజులకు ఒకసారి ఏఎన్‌ఎంలు ఆ ఇంటిని సందర్శించాలి. వారు పరిస్థితి చూసి, డాక్టర్ ఆ ఇంటికి వెళ్లేలా రిక్వెస్టు చేయాలి. రోగి పరిస్థితి బాగా లేకపోతే, కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించడం లేదా ఆస్పత్రిలో చేర్పించడంపై నిర్ణయం తీసుకుని అమలు చేయాలి’.
104 కాల్ సెంటర్: ‘104 కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చిన వెంటనే, సిబ్బంది వెళ్లాలి. పీహెచ్‌సీ నుంచి సిబ్బంది కదలాలి. 3 గంటల్లో అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలి. కోవిడ్ కేర్‌కు సంబంధించి 104 నెంబరు మస్ట్ బి సింగిల్ డెస్టినేషన్. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి’.
ఉచితంగా సేవలు: కోవిడ్ రోగికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రులలో రోగులకు మంచి వైద్య సేవలందించాలి. అవి కూడా పూర్తిగా ఉచితం. ఇది పక్కాగా అమలు కావాలి. అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కూడా అవసరమైన కోవిడ్ చికిత్సలు చేయాలి. అవి కోవిడ్ ఎంప్యానెల్‌లో లేనప్పటికీ. రెమ్‌డెస్‌విర్ వంటి ఇంజెక్షన్లు, నాణ్యతతో కూడిన డ్రగ్స్ అన్ని ఆస్పత్రులలో అందుబాటులో ఉండాలి. ఆ విధంగా కలెక్టర్లు అన్నీ చూడాలి’.
కొరడా ఝలిపించండి: ఇదే కాకుండా, ఆరోగ్యశ్రీ, కోవిడ్ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలి. అందుకోసం జీఓ నెం. 77, 78 ప్రకారం పక్కాగా అమలు చేయాలి. ఎక్కడైనా రోగుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం మీకు ఉంది. కోవిడ్ కష్టకాలంలో ఆస్పత్రులు రోగులను దోచుకోకుండా చూడాలి. అందు కోసం కఠినంగా వ్యవహరించండి’.
వాక్సిన్ తప్పనిసరి: ఇదే సమయంలో ప్రతి హెల్త్ వర్కర్, ప్రతి ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు తప్పనిసరిగా వాక్సిన్ ఇవ్వాలి. అది చాలా సురక్షితమని చెప్పాలి. సీఎం కూడా తీసుకున్నారన్న విషయం చెప్పాలి. అలా ప్రతి హెల్త్ వర్కర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ వాక్సిన్లు ఇవ్వాలి. హెల్త్ కేర్ వర్కర్లలో ఇంకా దాదాపు లక్ష మందికి వాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. విజయనగరం, కృష్ణా జిల్లాలలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది’. ‘ఫ్రంట్‌లైన్ వర్కర్లలో కూడా ఇంకా దాదాపు 1.8 లక్షల మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. వారందరికీ వాక్సిన్ ప్రాధాన్యత వివరించి, ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా సిద్దం చేయాలి. క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన ఈ కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.