‘హరేకృష్ణ’ క్షేత్రంలో.. నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
1 min readవిజయవాడ:అత్యంత వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మొట్టమొదటి సారి హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండలో శనివారం నుంచి రెండు రోజులపాటు జరుపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్న ఈ ఉత్సవాలలో భాగంగా భగవంతుని నివాసమైన వైకుంఠం ద్వారాలు తెరవబడతాయని తెలిపారు. విష్ణు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని ఆయన పవిత్ర నామాలను జపిస్తూ, ఆయన మహిమలను గానం చేస్తూ ఆయన్నే స్మరించుకుంటూ ఉంటారన్నారు. నమ్మాళ్వార్, శ్రీ వైష్ణవ సంప్రదా యంలో లక్ష్మీ దేవి నుండి వచ్చిన గురు-శిష్య పరంపరలో ఒక గొప్ప భక్తుడు, ఈ రోజున భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళాడని ప్రతీతి. ఈ సంఘటనను గుర్తుచేసుకోవ డానికి అన్ని విష్ణు దేవాలయాలలో ఈ రోజున సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకించి వైకుంఠ ఉత్తర ద్వారం తెరవబడు తుందన్నారు. ఈ రోజున ఎవరైనా ఈ ఉత్తర ద్వారంలోకి ప్రవేశించినంతనే ఆధ్యాత్మిక నిలయమైన వైకుంఠాన్ని పొందడం ఖాయమన్నారు.
నేడు ప్రత్యేక అలంకరణతో:
ఉత్తర ద్వార దర్శనం, స్వామివారికి లక్ష అర్చన, సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ వారి విశేష లడ్డూప్రసాదం స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.