డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు
1 min readపల్లెవెలుగు వెబ్, కడప: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష కాన్వాయ్‌ను శుక్రవారం ఇడమడక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కడప– కర్నూలు జాతీయ రహదారిపై ఇడమడక గ్రామం వద్ద రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో గ్రామానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై అండర్‌పాస్ రహదారి నిర్మించాలని కొన్ని నెలలుగా నేషనల్ హైవే అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని డిప్యూటీ సీఎం అంజాద్బాష ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇడమడక వద్ద అండర్‌పాస్ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల సమస్యను సానుకూలంగా విన్న డిప్యూటీ సీఎం అంజాద్బాష.. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించి… డిప్యూటీ సీఎం వాహనానికి దారి ఇచ్చారు.