ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కోటి జరిమానా !
1 min readపల్లెవెలుగు వెబ్ :ఆధార్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆధార్ నంబర్లు, సంబంధిత సమాచారం విషయంలో దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులు, సంస్థలకు ఇక నుంచి వేగంగా శిక్షలు, జరిమానాలు అమలుకానున్నాయి. ఈ మేరకు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు అధికారాలను కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ ఉల్లంఘనులను యూఐడీఏఐ చట్టపరంగా విచారించి జైలు శిక్షలు వేయవచ్చు. సంబంధిత వ్యక్తులు లేదా కంపెనీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఆధార్ ఉల్లంఘనల కేసులను విచారించడానికి జాయింట్ సెక్రటరీ హోదా గల ప్రత్యేక న్యాయాధికారులను యూఐడీఏఐ నియమించవచ్చు. న్యాయాధికారులు ఇచ్చే తీర్పులను సుప్రీం కోర్టులో లేదా టెలికాం అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో మాత్రమే సవాలు చేయడం వీలవుతుంది. దీంతో అక్రమాలకు పాల్పడే వారి పై ఈ చట్టం ఉక్కుపాదం మోపనుంది.