రంగు మారిన విశాఖ బీచ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్‌ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్‌లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్‌కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది.