‘విశ్వకర్మ యోజన’ను సద్వినియోగం చేసుకోండి
1 min readవిశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు కొత్తపల్లి శంకరయ్య
పల్లెవెలుగు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో 18 రకాల చేతి వృత్తి దారులు అర్హులని విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు కొత్తపల్లి శంకరయ్య స్పష్టం చేశారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వకర్మ చేతివృత్తుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం సీనియర్ నాయకుడు కొత్తపల్లి శంకరయ్య, న్యాయవాదుల సంఘం నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ, విశ్వకర్మ చేతి వృత్తి దారులు కొన్నేళ్ల నుంచి ఆర్థిక సామాజిక రంగాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది పాలకులు మారిన విశ్వకర్మ చేతివృత్తుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ చేతి వృత్తి దారుల యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ఈ పథకానికి 18 రకాల చేతి వృత్తదారుల్లో అర్హత కలిగిన వారికి పథకం అందుతుందన్నారు. అర్హులకు సర్టిఫికెట్ గుర్తింపు కార్డు ఉండాలని తెలిపారు. రూ.3 లక్షల వరకు హామీ లేని రుణం ఈ పథకం ద్వారా అందుకోవచ్చు నన్నారు.రూ. 15 వేల రాయితీతో టూల్ కిట్స్ అందుతాయని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయంలో అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పీఎం విశ్వకర్మ యువజన పథకానికి 18 ఏళ్లు నిండి, కుటుంబ వృత్తి గా ఉన్న వృత్తిదారులు అర్హులన్నారు. కుటుంబంలో ఒకరికే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబంలో ఒకరు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉండదన్నారు. ఐదు శాతం వడ్డీతో రూ.3 లక్షలు రుణం పొందవచ్చునని తెలిపారు.