PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్టా…ఉల్టా…!

1 min read

–  గ్రామాల్లో ఇష్టానుసారంగా వ్యవసాయ బోరు బావుల తవ్వకం

–  పట్టించుకోని రెవెన్యూ, భూగర్భజల శాఖల అధికారులు

–          భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం…!

ఖరీఫ్​ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు.. బోరుబావుల ఏర్పాటు పెనుసవాల్​గా మారింది. వైఎస్సార్​ జల కళకు దరఖాస్తు చేసుకున్నా.. పెద్దగా ఫలితం లేకపోవడంతో ..కొందరు రైతులు ప్రైవేట్​ బోరు వేల్స్​ ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు వాల్టా చట్టం 2002 ప్రకారం బోర్లు వేసుకోవాల్సి వుంటుంది. కానీ కొందరు రైతులు వాల్టాచట్టం నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఇష్టానుసారంగా బోరుబావులు వేసుకుంటున్నారు. భూమిలో నీటి శాతం తక్కువైతే…సాగు,తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది.   

పల్లెవెలుగు, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు, వాల్టా.. ఉల్టా మంత్రాలయం నియోజకవర్గాల్లో వాల్టా చట్టానికి కొందరు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రైవేట్ బోర్ వెల్స్ తో బోర్లను ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా బోర్లు తవ్వుతున్నారు . క్షేత్రస్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం -2002 లోని నిబంధలను ఎవరు పాటించడం లేదు.

క్షేత్రస్థాయిలో ఇలా..!

వాల్టా చట్టం నిబంధనల ప్రకారం.. ఏ రైతైనా తమ పొలంలో వ్యవసాయ బోరు వేయించుకోడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ కొందరు రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించుకున్న తరువాత మండల రెవెన్యూ అధికారుల దగ్గరకు వస్తున్నారు. అక్కడ ఎటువంటి విచారణ లేకుండా… భూగర్భజల శాఖ అధికారుల అనుమతి కూడా తీసుకోకుండానే ఎలక్ట్రికల్(APSPDCL) అధికారులకు రెఫర్ చేస్తున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో దాదాపు అలాగే జరుగుతోంది. ఇలా అనుమతి లేకుండా విచ్చల విడిగా బోరు బావులు త్రవ్వడం వలన భూగర్భజలాలు అతిగా వినియోగించడం వలన భూగర్భజల వనరులు అడుగంటి పోయే ప్రమాదం ఉంది.

 వాల్టాచట్టం… ఏం చెబుతోంది..!

రైతు పొలంలో బోరు వేయాలంటే.. సదరు రైతు రెవెన్యూ శాఖ అధికారుల, భూగర్భజల శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రైతు బోరు కోసం మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకుంటే… రెవెన్యూ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం -2002 నిబందనల ప్రకారం ఉండే సదరు ధరఖాస్తును భూగర్భజల శాఖ అధికారులకు పంపించాలి. భూగర్భజల శాఖ అధికారులు (జియాలజిస్ట్) రైతు పొలంలోకి వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం – 2002 ప్రకారం ఆయకట్టు ప్రాంతం లో బోరుకి బోరుకి కనీస దూరం 75 మీటర్లు మరియు ఆయకట్టేతర (వర్షాధార భూములు) ప్రాంతంలో కనీస దూరం 150 మీటర్లు పాటించి సాంకేతిక రెసిస్టీవిటి భూగర్భ జల సర్వేలు జరిపి ఎక్కడ నీరు పడుతుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి వాటి యొక్క నివేదికను మండల రెవెన్యూ అధికారులకు పంపిస్తారు.భూగర్భ జల శాఖ నివేదిక ఆదారంగా సదరు రైతుకు ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం -2002 ప్రకారము క్రొత్త బోరు బావును త్రవ్వుటకు అనుమతి మంజూరు చేస్తారు.రైతులు  భూగర్భ జల శాఖ వద్ద రిగ్గు రిజిస్టర్ చేసుకొన్న అధికారిక రిజిస్టర్ రిగ్గులతో మాత్రమే బోరు బావిని త్రవ్వించుకోవాలి అటులనే రిజిస్టర్ రిగ్గుల యజమానులు కూడా ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం -2002 ప్రకారము క్రొత్త బోరు బావును త్రవ్వుటకు అనుమతులు వచ్చిన వాటిని మాత్రమే బోరు డ్రిల్లింగ్ చేయాలి.అనధికారిక అనుమతులు లేని బోరు బావులు త్రవ్వడం చట్టరీత్యా నేరం.రిగ్గుల యజమానులు కూడా ఆంధ్ర ప్రదేశ్ వాల్టాచట్టం -2002 ప్రకారము భూగర్భ జల శాఖ వద్ద రిగ్గు రిజిస్ట్రేషన్  చేసుకోవాలి మరియు వాటిని పునరుద్ధరణ(Renewal) తప్పనిసరిగా చేసుకోవాలి.  రైతు బోరు బావును త్రవ్వున తర్వాత అదే నివేదికతో ఎలక్ట్రికల్ (APSPDCL) వారికి సమర్పించి పొందాల్సి ఉంటుంది.

40 దరఖాస్తులు మాత్రమే అందాయి..:

శ్రీనివాస రావు, భూగర్భజల వనరుల శాఖ డీడీ

రైతులు పొలాల్లో బోరుబావుల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కర్నూలు జిల్లా నుంచి బోరు బావుల ఏర్పాటుకు మండల రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. ఆ శాఖ నుంచి విచారణ జరపి  మమ్మల్ని సంప్రదిస్తే… మేము పొలాలకు వెళ్లి పరిశీలిస్తాము. ఆ తరువాత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తాము.  ఇప్పటి వరకు క్రిష్ణగిరి మండలం నుంచి 35, తుగ్గలి మండలం నుంచి 5 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగతా మండలాల రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి దరఖాస్తులు అందలేదు.

About Author