ఎటువంటి పొరపాటు లేకుండా ఓటర్ల జాబితా ను రూపొందించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఎటువంటి పొరపాటు లేకుండా ఓటర్ల జాబితా ను రూపొందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పై ఈ ఆర్ ఓ., ఏ ఈ ఆర్ ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని, జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుండి తొలగింపునకు గురికాకుండా చూడాలన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా అందిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 లను ఎన్నికల కమిషన్ నిబంధలు మేరకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. బి ఎల్ ఓ లు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించేలా పర్యవేక్షించి, ఓటర్ల జాబితా స్వచీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. . ఓటు హక్కు ప్రాధాన్యత పై కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి, 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా లో సవరణపై అందిన ఫిర్యాదులు, పత్రికలలో ప్రచురించిన వివాదాస్పద వార్తాంశాలపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. అధికసంఖ్యలో చేర్పులు, తొలగింపులు ఉన్న జాబితాలో సమగ్రంగా పరిశీలించాలని, అందుకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో డిశంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై పోలింగ్ బూత్ స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఎస్డీసీ గీతాంజలి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర, ప్రభృతులు పాల్గొన్నారు.