ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై సమీక్ష
1 min read– ఓటరు సవరణ కొరకు వచ్చిన విజ్ఞప్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి…
– జనవరి 5 వ తారీకు నాటికి సవరించబడ్డ ఓటర్ల లిస్టు ముద్రించే చర్యలు చేపట్టాలి…
– రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ముసాయిదా ఓటర్ల లిస్టు ప్రకటించిన తర్వాత వచ్చిన విజ్ఞప్తులు మరియు శని , ఆదివారాల్లో జరిగిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని విజయవాడ నుండి నిర్వహించి విషయాలు తెలుసుకున్నారు.మంగళవారం ఉదయం విజయవాడ నుండి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేశారు.అలాగే డిసెంబర్ 7 వ తారీఖు లోపల ఉన్న ఫారం లు అన్నీ అప్డేట్ చేసి జనవరి 5 తారీఖు నాటికి తప్పులు లేని ఓటర్ల లిస్టు తయారు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని , అవసరమైతే ఈ.ఆర్.ఓ లతో సంప్రదించాలని , ఫీల్డ్ వెరిఫికేషన్ కు కూడా వెళ్లాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఉన్న విజ్ఞప్తులను గురించి ప్రశ్నించారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ జీరో మరియు జంక్ క్యారెక్టర్స్ గా 77 ఉన్నాయని ఎందులో ఫారం -8 ద్వారా 64 తీసుకోవడం జరిగిందని 16 కరెక్షన్స్ చేశామని ఇంకా 61 చేయవలసి ఉన్నాయని తెలిపారు.పదిమంది కంటే ఎక్కువ ఓటర్లు గల ఇళ్లను 3,273 గా గుర్తించామని ఇందులో 47,686 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో 29,071 నిజమైన ఓటర్లుగా గుర్తించడము జరిగిందని 17,404 మంది ఓటర్లు వేరే ప్రాంతంలో ఉన్నారని తెలియజేశారు. నిర్ణీత ఫారం ద్వారా ప్రస్తుతానికి 4,225 మంది ఓటర్లను సరి చేశామని ఇంకా 13,044 మందివి సరి చేయవలసి ఉన్నదని, డిసెంబర్ నెల 7 వ తారీఖు లోపల మిగిలినవి కూడా సరి చేస్తామని జనవరి 5 నాటికి సవరించబడిన ఓటర్ లిస్ట్ ముద్రించడానికి చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి తెలియజేశారు.ఈ సమావేశానికి కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్ , ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళి పాల్గొన్నారు.