ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతీ ఒక్క పౌరుని బాధ్యత..
1 min readజిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యతని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దవన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఓటుహక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతని, ప్రతీ ఒక్కరూ తమ హక్కులతోపాటు తమ బాధ్యతలు కూడా తెలుసుకోవాలన్నారు. గతంలో ఎన్నికలలో 50 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేవారని, ఓటు నమోదు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు నమోదు కార్యాక్రమాలు ముమ్మరంగా జరగడంతో 60 నుండి 65 శాతం వరకు పోలింగ్ జరుగుతున్నదన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ కి రాలేని కదలలేని పరిస్థితిలో ఉన్న వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు వారి ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ కొత్తగా నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా జిల్లాలో 16. 24 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారని, మార్పులు,చేర్పులకు లక్షా 93 వేల 870 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో అర్హత కలిగిన వారి దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22 వ తేదీన విడుదల చేయడం జరిగిందని, ప్రతీ ఒక్కరూ జాబితాలో తమ ఓటును పరిశీలించుకోవాలన్నారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం లేదా, NVSP వెబ్సైటు లో పరిశీలించుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని, జాబితా మార్పులు, చేర్పులకు ఎన్నికల నోటిఫికేషన్ జరీ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వారి పేర్లు కొత్తగా నమోదుకు పోలింగ్ తేదీకి ముందు 10 రోజుల వరకు నమోదు చేసుకున్నవారు పేర్లు సప్లిమెంటరీ జాబితాలో ప్రచురించడం జరుగుతుందని, వారు ప్రస్తుత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యావంతులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ద్వారా 85 నుండి 90 శాతం వరకు పోలింగ్ జరిగితే ఉత్తమమైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణలో మహిళలు అధిక శాతం ఉన్నారన్నారు. గత ఎన్నికలలో మహిళలే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. నా ఒక్కడి ఓటు వేయకపోతే ఎం పోతుందని అని కాకుండా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉత్తమమైన పాలన మూల స్తంభం వంటిదని, అందుకు ప్రతీ ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువత ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నామని, పోలింగ్ శాతం పెంచేందుకు “ఓటు హక్కు వినియోగించుకోవడం కంటే ముఖ్యమైన పని లేదు.. నేను వినియోగించుకుంటాను” నినాదంతో ఓటు హక్కు వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి , ప్రభృతులు ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని సభికులచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 80 సంవత్సరాల వయస్సు నిండి ప్రతీ ఎన్నికలలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ముద్దం సుబ్బారావు (101 సంవత్సరాలు),, దాట్ల శేషమరాజు, దేవరపల్లి కుటుంబరావు, పొన్నగంటి సూరమ్మ, మల్లెమొగ్గల సత్యనారాయణ ,ముంతా విశ్వేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతులు భీముని రమేష్ లను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు పూలమాల, శాలువా, మెమెంటో తో సత్కరించారు. నూతనంగా ఓటరుగా నమోదైన 5 గురు విద్యార్థిని, విద్యార్థులకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, వినియోగంపై పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలు విజేతలకు బహుమతులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యత, వినియోగం, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న అంశంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. కార్యక్రమంలో జిల్క పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకట కృష్ణ, గృహనిర్మాణ శాఖ పీడీ కె. రవికుమార్, డి ఆర్ డి ఏ పీడీ విజయరాజు, తహసీల్దార్ సోమశేఖర్, ప్రభృతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆర్టీసీ పి .ఆర్.ఓ , నరసింహారావు వ్యవహరించారు.