వడ్డే ఓబన్న జీవిత చరిత్ర చారిత్రాత్మకం
1 min readయువత స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి.
ఘనంగా వడ్డే ఓబన్న 217 వ జయంతి వేడుకలు.
జయంతి వేడుకలను నిర్వహించిన వడ్డెర సంఘం నేతలు.
స్వాతంత్ర సమరంలో వడ్డే ఓబన్న పోరాటాలు మరువలేనిది.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తొలితరం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలు వడ్డే ఓబన్న జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘ నేతలు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర చారిత్రాత్మకమని వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన అడుగుజాడల్లో నేటితరం యువత అలాగే భావితరాల వారు నడవాలని తెలిపారు. రేనాటి ప్రాంతంలో బ్రిటిష్ వారు ప్రజలపై అక్రమంగా విధించిన పన్నులకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన రైతు వారి పద్ధతికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు . సైరా నరసింహారెడ్డి కి కుడి భుజంగా ఉంటూ చిన్న, సన్న కారు, వడ్డెర, బోయ, యానాది, చెంచు వంటి వారిని తొమ్మిది వేల మందికి పైగా పోగుచేసి సైన్యాధిపతిగా బ్రిటిష్ సైన్యం పై దండెత్తారని తెలిపారు. వీరుడైన వడ్డే ఓబన్న సాధించిన విజయాలలో 1846 మే నెలలో కోవెలకుంట్లలోని ట్రెజరీని కొల్లగొట్టి ప్రజలకు డబ్బు పంచిపెట్టాడు. అదే ఏడాది జూలై నెలలో లెఫ్టినెంట్ వాట్సల్ మిలిటరీతో పోరాటం చేసి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టి విజయం సాధించారు. 1846 అక్టోబర్ 6వ తేదీన కర్నూలు జిల్లా పేరుసోముల కొండమీద జరిగిన యుద్ధంలో వడ్డే ఓబన్న వీరమరణం పొందారని డాక్టర్ బత్తుల సంజీవ రాయుడు తెలిపారు .రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ప్రతి ఏడాది జనవరి 11న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బత్తుల సంజీవరాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో రాజు,శివమణి, చిన్న,శివకృష్ణా,శ్రీనివాసులు,వెంకటకృష్ణ,డాక్టర్ శ్రీవాసులు, ఆజాద్, బత్తుల సంజీవరాయుడు, నరసింహులు పాల్గొన్నారు.