తుంగభద్ర..హంద్రీ.. కేసీ.. ఉన్నా.. నీటి సమస్యలే: టీజీ భరత్
1 min readకర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు చుట్టూ తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ ఉన్నప్పటికీ ప్రజలకు నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. 49వ వార్డు ఎన్‌ఆర్‌పేటలో టీడీపీ యువ నాయకుడు కౌశిక్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై మాట్లాడారు. నీటి సమస్య పరిష్కారం అయ్యేట్లు అల్లాను ప్రతి ఒక్కరు కోరుకోవాలన్నారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న ఈ నాయకులకు ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియలేదన్నారు. తన తండ్రి టీజీ వెంకటేశ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూసుకునేవారని చెప్పారు. ఇప్పటికైనా కర్నూలు ప్రజలు గ్రహించి గత ఎన్నికల్లో చేసిన పొరపాటును రాబోయే ఎన్నికల్లో చేయొద్దన్నారు. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖాలిద్, వార్డు ఇంఛార్జ్ విక్రమ్ సింగ్, మని ప్రకాష్, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.