ప్రజల నీటి కష్టాలు తీరుస్తా.. కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు వాసుల త్రాగునీటి కష్టాలు తాను తీరుస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్‌లో 22వ వార్డుకు చెందిన మహిళలు టి.జి భరత్‌ను కలిసి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కర్నూలు చుట్టూ తుంగభద్ర, హంద్రీ, కె.సి కెనాల్ ఉన్నప్పటికీ త్రాగునీటి కోసం నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. అప్పట్లో తన తండ్రి టి.జి వెంకటేష్ నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. చెక్ డ్యాం నిర్మించాలని ఆయన అనుకున్నారని.. అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు దాని గురించి పట్టించుకోలేదన్నారు. రానున్న వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు వస్తే బాధ్యత ఎవరు వహిస్తారన్నారు. అందుకే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని టి.జి భరత్ కోరారు. ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. తమ టిడిపి, జనసేన ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి శ్రీధర్, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని 4వ వార్డు చిత్తారి వీధికి చెందిన పలువురు టిడిపి నాయకురాలు నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.