‘హంద్రీ’ కాలువకు నీటిని కొనసాగించాలి
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ:హంద్రీనీవా కాలువకు మార్చి 2023 వరకు నీటిని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నాలుగు స్తంభాల కూడలి వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హంద్రీనీవా కాలువ కింద నాన్ ఆయకట్టు దారులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారని, అయితే హంద్రీనీవా ద్వారా డిసెంబర్ 31 వరకే నీటిని వదులుతామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సిపిఎం నాయకులు రంగారెడ్డి, కొండారెడ్డి, వీర శేఖర్ సిద్దయ్య గౌడ్ మండిపడ్డారు. జిల్లా మంత్రి జయరాం ఇటీవల హంద్రీనీవా కాలువ ద్వారా మార్చి 2023 వరకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినందు వల్లనే రైతులు లక్షలు పెట్టుబడులు పోసి పంటలు సాగు చేసుకున్నారని తెలిపారు. తీరా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు హంద్రీ కాలువకు డిసెంబర్ వరకే నీటిని విడుదల చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం సబబుగా లేదని అన్నారు. అలా కాని ఎడల రైతులు వేల ఎకరాల్లో వేసుకున్న పంటలు ఎండిపోయి తీరని నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి 2023 మార్చి నెల వరకు హంద్రీనీవా కాలువకు నీటిని కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. దాదాపు అరగంట పాటు రైతులు రోడ్డుపై బైఠాయించి మార్చి 2023 వరకు హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి గోపాలు శ్రీరాములు తోపాటు డివైఎఫ్ఐ సిఐటియు రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.