మీరు చేసిన సాయం వల్లే చదువు కొనసాగిస్తున్నాం
1 min read
యువనేత లోకేష్ కు విద్యార్థినుల కృతజ్ఞతలు
చదువు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుంటానన్న లోకేష్
ఉత్తమ కార్యకర్త కుటుంబసభ్యులను సత్కరించిన యువనేత
గుంతకల్లు, న్యూస్ నేడు: కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను అన్నలా ఆదుకున్న యువనేత నారా లోకేష్ లోకేష్ చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గుంతకల్లు నియోజకవర్గం శంకరబండకు చెందిన బోనాసి ప్రభాకర్ రెండో విడత కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయన భార్య, కుమార్తెలకు ఏంచేయాలో పాలుపోలేదు. అప్పటికి పెద్ద కుమార్తె పురంధేశ్వరి బి.టెక్ ఫస్టియర్ చదువుతుండగా, మరో కుమార్తె స్నేహలత ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. నంద్యాలలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రభాకర్ భార్య, కుమార్తెలు యువనేత లోకేష్ ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. దీంతో చలించిన లోకేష్ ఆ ఇద్దరు బిడ్డలను తాను చదివిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దకుమార్తె పురంధేశ్వరికి ఫీజు తానే చెల్లిస్తూ చదివిస్తున్నారు. చిన్న కుమార్తె స్నేహలతను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. ప్రభాకర్ భార్య, కుమార్తెలు గురువారం గుత్తిలో మంత్రి లోకేష్ ను కలిసి తమ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఇద్దరు విద్యార్థినుల చదువు పూర్తయ్యే వరకు తాను అండగా ఉంటానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా పామిడికి చెందిన ఉత్తమ కార్యకర్త, యూనిట్ ఇన్చార్జి పివి శివకుమార్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. గుత్తిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం సందర్భంగా ఆయన భార్య, కుమారుడ్ని పిలిపించి మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సత్కరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.