మట్టి వినాయక విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులో మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే పెట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నామని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ మట్టి వినాయకుడి విగ్రహాలు అంటే దేశ వ్యాప్తంగా మన కర్నూలు నగరమే గుర్తొచ్చేలా చేయాలన్నది తన కల అన్నారు. అందుకే తమ టీజీవీ సంస్థల తరుపున కర్నూలు నగరంలో 7200 మట్టి విగ్రహాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 205 కి పైగా వినాయక విగ్రహాలకు రూ. 7500 చొప్పున ఒక్కో విగ్రహానికి విరాళం ఇచ్చానన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగరంలోని పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన 56 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహం నగరానికి ఎంతో ప్రత్యేకమన్నారు. అందుకే ఈ విగ్రహం ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి వినాయక భక్త కమిటీకి తమ టీజీవి సంస్థల తరుపున రూ. 1 లక్ష విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసే వారికి భవిష్యత్తులో తమ సంస్థల తరుపున విరాళం కూడా ఎక్కువగా అందజేసి ప్రోత్సహిస్తామని భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వినాయక విగ్రహ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.