గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉన్నాం.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readవైసీపీని వీడి టిడిపిలో చేరిన ముస్లిం యువత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాము ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజాసేవ మాత్రం మరువలేదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్‌లో తెలుగుయువత స్టేట్ జనరల్ సెక్రటరీ లక్కీటూ గోపి ఆధ్వర్యంలో 50వ వార్డుకు చెందిన ముస్లిం యువకులు, మహిళలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ తాము టి.జి భరత్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కర్నూలు అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. టి.జి భరత్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్న చరిత్ర తమదన్నారు. నగరంలో ఏ వార్డుకు వెళ్లినా టి.జి మార్క్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు కేవలం కులం చూసి వైసీపీ నేతలు అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారన్నారు. పదేళ్లపాటు కర్నూల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని సొంతంగా 6 గ్యారెంటీల మేనిఫెస్టోను తయారుచేశానని భరత్ తెలిపారు. కర్నూల్లో ఉన్న ముస్లింలందరూ తనను ఈ సారి గెలిపించాలని కోరారు. తన గెలుపు కోసం ముస్లిం యువకులందరూ అల్లాను ప్రార్థించాలన్నారు. ప్రజలందరి దీవెనలతో గెలిచిన తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా కర్నూలు రూపురేఖలు మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, రఫి, మజార్, మస్తాన్, శ్రీకాంత్, రఫిక్, తదితరులు పాల్గొన్నారు.