తాగునీటి సమస్య రాకుండా చూడాలి…
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 13 వినతులు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 13 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అర్జిదారులకు కమిషనర్ హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ యన్.చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈ సత్యనారాయణ, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..గౌలిగేరి నందు తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతున్నాయని, తద్వారా తమకు నీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు డి.నారయ్య ఫిర్యాదు చేశారు. బాబా బృందావన్ నగర్ నందు తాగునీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బందిగా ఉందని స్థానికులు యస్.వి. సుబ్బయ్య, యస్.సుబ్బమ్మ విన్నవించారు. ఇలాంటి సమస్యనే తమ కాలనీ రాజీవ్ నగర్‌లో ఉందని యం.మల్లికార్జున అర్జీ ఇచ్చారు. స్టాంటన్‌పురం నందు బైరెడ్డి ఫంక్షన్ హాలు పక్కన ప్రధాన రహదారి నుండి మ్యాప్లీ హోమ్స్ వరకు సిసి రహదారి నిర్మించాలని స్థానికులు డి.విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ నుండి జోహరపురం కే.సి. కెనాల్ వెళ్ళు 100 అడుగుల రహదారిని కొందరు అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సర్వే చేసి వాటిని కాపాడాలని, అక్కడ వెంటనే రహదారి నిర్మించాలని నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, రాంప్రియ నగర్, యాగంటిశ్వర కాలనీ వాసులు అభ్యర్థించారు. మహావీర్ కాలనీ నందు వాహనాల వాటర్ సర్వీసింగ్ నీరు ఓ గుంతలో నిల్వ అవుతున్నాయని, అందులో పందులు స్థైర్య విహారం చేస్తున్నాయని, అక్కడ సిసి డ్రైనేజీ కాలువ నిర్మించాలని, అలాగే వీధి దీపాలు వెలగటం లేదని స్థానికులు మహేష్, పవన్ విన్నవించారు.