ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. టీజీ భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాను ఎమ్మెల్యే అవ్వగానే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ అన్నారు. నగరంలోని 6వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు టిజి భరత్ కు పారిశుధ్య సమస్యలతో పాటు పెన్షన్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఆరోగ్యశ్రీ సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూల్లో అర్హులకు కూడా సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే, అధికారులు కలిసి వార్డుల్లోకి వస్తే ప్రజల సమస్యలు అర్థమవుతాయన్నారు. ఇక్కడ పార్టీలను పక్కనపెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందరం కలిసి పనిచేద్దామని తాను కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయాలు అవసరం లేదని అందరం కలిసి ప్రజల సమస్యలను పరిష్కరిద్దామన్నారు. క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలుస్తాయన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని, వర్షం వస్తే విద్యుత్ షాక్ తగిలేటట్లు వార్డులో పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రమాదాలు జరగకముందే ముందస్తుగా స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జహంగీర్ భాష, ఇబ్రహీం, మెహబూబ్ నయీమ్, గౌస్, సలీం, ఖాదర్, జుబెయిర్, ఫయాజ్, అబ్దుల్లా, ఇతర నేతలు , తదితరులు పాల్గొన్నారు.