డబ్బులు వసూలు చేసి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
1 min read– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
– జిల్లాలో 9 ఆస్పత్రుల్లో రోగుల నుండి డబ్బు వసూలు చేసినట్లు ఫిర్యాదులు
– రోగుల నుండి తీసుకున్న మొత్తం రిఫండ్ చేయడం పాటు మూడింతల మొత్తాన్ని అదనంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆరోగ్య శ్రీ రోగుల నుండి డబ్బులు వసూలు చేసి వైద్యం చేస్తే అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు సంబంధిత ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు పై జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ సభ్యులతో మరియు వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు,సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు..అయినప్పటికీ కూడ జిల్లాలో ఉన్న 9 ప్రైవేట్ ఆస్పత్రులలో 26 మంది ఆరోగ్య శ్రీ రోగుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడం పట్ల జిల్లా కలెక్టర్ ఆస్పత్రి యాజమాన్యాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు…ఇలాంటి ఫిర్యాదులు రావడం వల్ల అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా డబ్బు వసూలు చేసిన 9 ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుండి తీసుకున్న మొత్తాన్ని రిఫండ్ చేయడం తో పాటు మూడింతల మొత్తాన్ని అదనంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రఘును ఆదేశించారు. ఇక మీదట అయినా ఆస్పత్రి యాజమాన్యాలు మరల ఇటువంటి ఫిర్యాదులు పునరావృతము కాకుండా, ఆరోగ్య శ్రీ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రఘు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య ,డిసిహెచ్ఎస్ రాంజీ నాయక్, ఆరోగ్య మిత్ర సూపర్వైజర్స్ ,ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల ప్రతినిధులు, పాల్గొన్నారు.