NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమానికి తొలి ప్రాధాన్యం….

1 min read

అమరావతి, న్యూస్​ నేడు:  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై సీఎం పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సివుందన్నారు. తమ ప్రభుత్వంలో బడుగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పీ4లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా, మహిళా సంఘాల ద్వారా పేదలను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం వెల్లడించారు.

అరకు కాఫీకి బ్రాండింగ్.. చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు

గిరిజన సంక్షేమంలో భాగంగా అరకు కాఫీని ప్రోత్సహించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించామన్నారు. కాఫీలో అంతరపంటగా వేసే నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్, జీడి వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు. గిరిజన ఉత్పత్తుల పరిరక్షణకు అవసరమైతే డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. సేంద్రియ సేద్యానికి అరకుకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో వనరులు ఉన్నాయని, ఆదివాసీల్లో చైతన్యం లేకే వెనకబడి ఉన్నారని సీఎం అభిప్రాయపడ్డారు. తన ప్రభుత్వం గతంలో చైతన్యం అనే పథకం ద్వారా ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అదేవిధంగా ఎస్సీ సంక్షేమానికి ముందడుగు, బీసీల పురోగతికి ఆదరణ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆదరణ-3 పథకం ద్వారా ఆధునాతన టెక్నాలజీ, పరికరాలు సమకూరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ప్రతి ఒక్కరికి ఇళ్లు రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు ఎవరూ ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.అదేవిధంగా గ్యాస్, మరుగుదొడ్లు, మంచినీటి కొళాయిలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపరచి గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల వారి ఆర్థిక పురోగతికి పాటుపడాలని చెప్పారు. ప్రస్తుత కాలంలో రోడ్డు వేయడం కష్టమని, ఇంటర్నెట్ సౌకర్యం చాలా ఈజీగా చెప్పిన సీఎం.. పేదల అభ్యున్నతికి ఇంటర్నెట్ వాడుకోవాలని సూచించారు.

వడ్డెరలకు క్వారీలు, మత్స్యకారులకు చెరువులు

బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా ప్రణాళికలు రచించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు నివ్వాలని సూచించారు. కల్లు గీత కార్మికులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలని చెప్పారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నామని, వారు ఉత్పత్తి చేసిన వస్త్రాలకు జీఎస్టీ రద్దు చేసినట్లు సీఎం వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *