అర్హులందరికీ..సంక్షేమ పథకాలు: టి.జి భరత్
1 min read
అరోరా నగర్‌లో టిజి భరత్ భరోసా యాత్ర
కర్నూలు, పల్లెవెలుగు: తాను అధికారంలోకి వచ్చాక కర్నూల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ హామీ ఇచ్చారు. నగరంలోని అరోరా నగర్‌లో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చాలా మందికి అందలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. నగరంలో ఉన్న విద్యుత్, డ్రైనేజీ సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానని చెప్పారు. నాయకుడు సరైన వ్యక్తి అయితే ప్రజలకు ఇబ్బందులు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు మోసపోయింది చాలని.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు వచ్చిన తనకు ఓటు వేయాలని కోరారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. తనకున్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి శ్రీధర్, బాలు, జనసేన నాయకులు పవన్, బూత్ ఇంఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.