భేష్..సవితమ్మ..
1 min read
డోన్/కర్నూలు న్యూస్ నేడు : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి మానవత్వాన్ని చూపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్ కు దగ్గరుండి ప్రాథమిక వైద్యమందించి, సపర్యలు చేయించారు. 108 వాహనానికి ఫోన్ చేసి, క్షతగాత్రులను తరలించారు. మంత్రి సవిత సహాయక చర్యలను స్థానికులు, వాహనదారులు కొనియాడారు. మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డోన్ లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని పెనుకొండకు తిరిగి పయనమయ్యారు. అదే సమయంలో డోన్ సమీపంలో బుచ్చయ్యగారిపల్లె నుంచి హైదరాబాద్ కు మామిడి కాయల లోడ్ తో వెళుతున్న వ్యాన్ ఓబిలాపురం సమీపంలో టైర్ పేలిపోవడంతో బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న మంత్రి సవిత…తన కాన్వాయ్ ను ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. 108 వాహనంలో వచ్చేలోగా, తన కాన్వాయ్ లో ఉన్న ప్రథమ చికిత్స కిట్ తో క్షతగాత్రులకు తన సిబ్బందితో వైద్య సాయమందించారు. డోన్ ప్రభుత్వాసుపత్రి వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యమందించాలని మంత్రి ఆదేశించారు. స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం ఏమీ లేదని క్షతగాత్రులను ఓదార్చి పెనుకొండకు మంత్రి సవిత పయనమయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే, కాన్వాయ్ ను ఆపి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించిన మంత్రి సవితపై స్థానికులు, వాహనదారులు ప్రశంసలు కురిపించారు. జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం.