PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జాక్ మా ’ మీద చైనా క‌క్ష గ‌ట్టిందా?

1 min read

ధిక్కార స్వరం అణ‌చివేత‌

జాక్ మా అంటే భ‌య‌మా?

లేదంటే దేశ ప్రజ‌ల‌కు హెచ్చరికా?
ప‌ల్లెవెలుగు వెబ్: జాక్ మా అలీబాబా గ్రూప్ వ్యవ‌స్థాప‌కుడు. అంచ‌లంచెలుగా ఎదిగిన సాధార‌ణ స్కూల్ టీచ‌ర్. ముప్పైసార్లు ఉద్యోగ తిర‌స్కర‌ణ‌కు గురైన స్థాయి నుంచి .. ల‌క్షలాది ఉద్యోగాలు క‌ల్పించే స్థాయికి ఎదిగిన‌ కృషీవ‌లుడు. ఇంట‌ర్నెట్ వినియోగం లేని స‌మ‌యంలో.. కంప్యూట‌ర్ మొహం చూడ‌ని సంద‌ర్భంలో చైనాలో అలీబాబాలాంటి ఈ-కామ‌ర్స్ సంస్థను స్థాపించిన ఘ‌నుడు. చైనాలోని చిన్న వ్యాపారుల‌కు ఆరాధ్యుడు. దేశంలో చిన్నాభిన్నంగా ఉన్న రిటైల్ వ్యాపారాల‌ను ఆర్గనైజ్ చేసి.. ఈ-కామ‌ర్స్ వ్యాపారాన్ని సుల‌భ‌త‌రం చేశారు జాక్ మా. 13 ఏళ్లు అహోరాత్రులు క‌ష్టించి.. ప‌ట్టువీడ‌క త‌న ల‌క్ష్యాన్ని ఛేదించి, గ‌మ్యాన్ని చేరుకున్న ధీరుడుని చెప్పవ‌చ్చు. చైనాలో ఈ-కామ‌ర్స్ రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించాడు. ఇంట‌ర్నెట్ వినియోగం లేని స్థాయి నుంచి ఇంటర్నెట్ ద్వార ల‌క్షల కోట్ల వ్యాపారం జ‌రిగే స్థాయికి చైనాని తీసుకురావ‌డంలో ఆయ‌న కృషి సామ‌న్యమైన‌ది కాదు. ప్రపంచ వాణిజ్య ప‌టంలో అలీబాబా సంస్థను, చైనా కీర్తిని నిల‌బెట్టాడు. అలీబాబా ఐపీవో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో చరిత్ర సృష్టించింది. ఒక విదేశీ కంపెనీ ఇంత సంచ‌ల‌నం సృష్టిచండం అమెరికా చ‌రిత్రలో అదే మొద‌టిసారి.
చైనా క‌మ్యూనిస్టులు ఎందుకు క‌క్షగ‌ట్టారు? : జాక్ మా ‘అలీబాబా’ సంస్థ విజ‌య‌ప‌రంప‌ర ఒక్క ఈ-కామ‌ర్స్ విభాగంలోనే కాక‌.. మిగిలిన రంగాల్లో కూడ చూపించాల‌నుకుంది. దీంట్లో భాగంగా వివిధ రంగాల‌లో పెట్టుబ‌డులు పెట్టింది. ఆ రంగాల్లో కూడ మోనోపాలీగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతూ వ‌చ్చింది. ప్రపంచ కుబేరుల్లో ఒక‌రిగా జాక్ మా ఎదిగాడు. చైనాలో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి వ‌చ్చాడు. ఫైనాన్సియల్ విభాగంలో కూడ ప్రవేశించేందుకు యాంట్ ఐపీవో తీసుకొచ్చారు. అయితే.. ఈ మ‌ధ్య కాలంలో చైనా ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు. చైనాలోని బ్యాంకులు తాక‌ట్టు దుకాణాల మ‌న‌స్తత్వాన్ని వ‌ద‌లాల‌ని సూచించారు. దీంతో క‌మ్యూనిస్టు స‌ర్కారు క‌న్నెర్రచేసింది. జాక్ మాకు చెందిన యాంట్ ఐపీవో లిస్టింగ్ ను ఆపేసింది. రెగ్యూలేష‌న్ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి..ఏక‌ప‌క్షంగా ఎద‌గాలని జాక్ మా ప్రయ‌త్నిస్తున్నాడంటూ చైనా ప్రభుత్వం సోదాలు జ‌రిపించింది. తాజాగా 2.4 బిలియ‌న్ల జ‌రీమాన విధించింది. ఇది అతిపెద్ద జ‌రిమానాగా చెప్పుకుంటున్నారు.


చైనా ప్రభుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌కూడ‌దా? : చైనాలో ఒక నిర్భంద ప్రజాస్వామ్యం ఉంద‌ని చాలా మంది విమర్శిస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఎవ‌రు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని క‌ఠినంగా శిక్షిస్తార‌ని అంటారు. చైనా క‌మ్యూనిస్టు పార్టీ పాల‌న ఒక‌ర‌కమైన నియంత పాల‌న‌గా చెబుతారు. దేశంలో సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే వ‌ద‌ల‌ని వారు.. అంత‌ర్జాతీయ వేదిక మీద జాక్ మా లాంటి కుబేరుడు ప్రశ్నిస్తే ..విమ‌ర్శిస్తే ఊరుకుంటారా?. అందుకే జాక్ మా చైనా ప్రభుత్వం మీద విమ‌ర్శలు చేసిన త‌ర్వాత కొన్ని నెల‌ల‌పాటు బ‌య‌టి ప్రపంచానికి క‌నిపించ‌లేదు. క‌నీసం ఫోటోకు మీడియాలో క‌న‌ప‌డ‌లేదు. ఇంట్లో నుంచి బ‌య‌టికికూడ అడుగుపెట్టినివ్వలేద‌ని ప‌లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
అలీబాబా భ‌విష్యత్తు ఎలా ఉండ‌బోతోంది?. : జాక్ మా మీద చైనా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకున్నాక‌.. ఆయ‌న కంపెనీల విలువ షేర్ మార్కెట్లో అమాంతం ప‌డిపోయాయి. ప్రపంచ కుబేరుల స్థానంలో కూడ జాక్ మా స్థానం దిగ‌జారింది. అలీబాబా కంపెనీ అన్ని ర‌కాల నిర్భందాన్ని, జ‌రిమానాల్ని ఎదుర్కొంటోంది. చైనాలో ప్రభుత్వానికి ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చూప‌డానికే క‌మ్యూనిస్టు ప్రభుత్వం ఇలా జాక్ మాను వేధిస్త్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. చైనా ప్రభుత్వం కోపం చ‌ల్లారితే కాని అలీబాబా భ‌విత‌వ్యం తేల‌దు. మ‌రి జాక్ మా ఏం చేస్తారు అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. జాక్ మా త‌దుపరి చ‌ర్యల మీదే అలీబాబా కంపెనీ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది.

About Author

1 thought on “‘జాక్ మా ’ మీద చైనా క‌క్ష గ‌ట్టిందా?

Comments are closed.