జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి..?
1 min readపల్లె వెలుగు వెబ్: మనిషి నిరంతర అన్వేషి. ఒక బండరాయిలా ఉన్న చోటనే ఉండాలని కోరుకోడు. ఏదో విధంగా ఒక్కోమెట్టు ఎక్కి తన గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు. జీవితంలో విజయం సాధించాలనే కోరిక, ఉన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆలోచన లేని మనిషి ఉండడు. తనకంటూ గొప్ప జీవితం, మంచి జీవన విధానం కోరుకుంటాడు. ఈ క్రమంలోనే డబ్బు సంపాదించాలనే కోరిక బలపడుతుంది. అన్ని అవసరాలకు డబ్బు అనేది ప్రధానం. కాబట్టి ఒక మనిషి తను అనుకున్న విధంగా ఎదగాలన్నా.. డబ్బు సంపాదించాలన్నా కొన్ని ముఖ్యమైన పద్దతులు పాటించాలి. అవి పాటించగలిగితే అతని స్థానం శిఖర స్థాయికి చేరుతుంది.
తొందరగా మొదలు పెట్టండి: ఏ పనినైనా తొందరగా ప్రారంభించాలి. సాధ్యమైనంత వరకు చిన్న వయసులో మొదలుపెట్టాలి. ఇప్పుడు అవసరం లేదు కదా… ఇంకెప్పుడో చూద్దాంలే.. అనే నిర్లక్ష్యం ఉండరాదు. ఎలన్ మస్క్, వారన్ బఫెట్, రిచర్డ్ బ్రన్సన్ లాంటి కోటీశ్వరులు తమ పనిని చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. తమ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లారు. ఒక స్టార్టప్ కానీ, వ్యాపారం కానీ, పనిని కానీ ప్రారంభించే సమయంలో చిన్న స్థాయిలో ప్రారంభించాలి. అప్పుడు ఆ పనిలో ఉన్న లోటుపాట్లు, కష్టనష్టాలు మనకు తెలిసి వస్తాయి. ఫలితంగా ఆ పనిని విస్తరించే సమయంలో మనకు ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. అనుభవం ద్వార నేర్చుకునే పాఠాలు చాలా విలువైనవి.
మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలి. మనం ఒక నిత్య విద్యార్థి కావాలి. విజయం సాధించిన వారి ఇంటర్య్వూలు, వారి జీవితం, వారి అనుభవాలు తెలుసుకోవాలి. వారు చేసిన తప్పులు తెలుసుకుని వాటిని మనం తిరిగి చేయకూడదు. తరుచూ పుస్తకాలు చదవాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ప్రజలతో ఎలా మెలగాలి, ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. మనల్ని మనం నిరంతరం మోటివేట్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి. క్రమశిక్షణతో మెలగాలి. సమయాన్ని వినియోగించుకోవడం తెలియాలి. సమయం డబ్బు కంటే విలువైంది. సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే డబ్బును సంపాదించగలం. మన మీద మనం పెట్టుబడి పెట్టడం అంటే.. ఇలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే.
తొందరగా ఫెయిల్ అవ్వండి: జీవితంలో ఎంత తొందరగా ఫెయిల్ అయితే.. అంత మంచిది. ఎందుకంటే విజయం సాధించినప్పుడు వచ్చే అనుభవం కన్నా ఓడిపోయినప్పుడు వచ్చే అనుభవాలు, నేర్చుకునే పాఠాలు చాలా విలువైనవి. ఇవి మీకు జీవితాంతం ఉపయోగపడుతాయి. ఓడిపోవడం తప్పు కాదు. మళ్లీ ప్రయత్నించకపోవడం తప్పు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. పట్టుదలతో ముందుకు కదిలితే విజయం సొంతమవుతుంది.
వారానికి 100 గంటలు పనిచేయండి: రోజుకు 8 గంటలు పనిచేయడం మనకు అలవాటు. మరికొందరు అంత కంటే తక్కువ సమయం పనిచేస్తారు. రోజుకు 100 గంటలు అంటే.. రోజుకు దాదాపు 17 గంటలు పనిచేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేషన్స్ లాంటి సామాజిక బంధాలను దూరంగా ఉంచగలగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యం. ఇది చాలా మంది పాటించలేరు. అందుకే కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. కానీ ఆ విజయం కూడ వారు ఎంత సేపు పని చేశారు. ఎంత కష్టపడ్డారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
మీ మొదటి పనిని సక్సెస్ చేయండి: మీరు మొదటి పని మొదలు పెట్టే ముందు.. చాలా మంది జీవితాల్ని, వ్యాపారాల్ని, వారి పద్దతుల్ని అధ్యయనం చేసి ఉంటారు. వాటిని ద్వార పొందిన జ్ఞానంతో మీ బిజినెస్ ను సక్సెస్ చేసుకోండి. మీరు పొందిన జ్ఙానాన్ని, డబ్బును తిరిగి పెట్టుబడిగా పెట్టండి. అప్పుడే మీ బిజినెస్ లో క్యాష్ ఫ్లో ప్రారంభం అవుతుంది. ప్రతి బిజినెస్ సక్సెస్ కావాలంటే.. ఖచ్చితంగా క్యాష్ ఫ్లో ఉండాలి. క్యాష్ ఫ్లో అంటే.. మనం పెట్టిన పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను.. మిగిలే ఆదాయం.
మీ వ్యాపారాన్ని విస్తరించండి : మొదటగా విజయం సాధించిన తర్వాత మీ వ్యాపారాన్ని విస్తరించాలి. విస్తరించగలిగితేనే మీ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుంది. క్యాష్ ఫ్లో అదనంగా రావడం మొదలవుతుంది. మరిన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనండి. సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపగలిగితేనే మీ వ్యాపారం సూపర్ సక్సెస్ అవుతుంది. మీరు కావలిసినంత డబ్బును సంపాదిస్తారు. మీరనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.