దిశ చట్టం ఏమైంది? : డా.బైరెడ్డి శబరి
1 min read– మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టండి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన దిశ చట్టం ఏమైందని బీజేవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరి ప్రశ్నించారు. గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి మహిళ మోర్చ నాయకులతో కలసి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ మహిళలపై దాడులు జరిగితే దిశ చట్టం ఉపయోగించి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు వట్టి మాటలుగానే మిగిలి పోయాయన్నారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. మహిళలకు భరోసా కల్పించాల్సిన మహిళ మంత్రులు మహిళలపై దాడులు జరిగితే స్పందించిన తీరు సరైనది కాదన్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దీన్ని బట్టి వ్యవస్థను ఈ పాలకులు ఎలా గాడి తప్పించారో అర్థం అవుతోందన్నారు. పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలను గాలికొదిలేసిందన్నారు. మహిళలకు రక్షణ కల్పించి, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు మాలతి, ధనలక్ష్మి, సుజాత, సునీత, నది ఈశ్వరి, దిల్సా బేగం, శాంతి, శాంతమ్మ, అనురాధ, అభిలాష, నివేదిత మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.