PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ లేఅవుట్లపై కొరడా

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి బాల మద్దయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 29 మున్సిపల్ వార్డులలో 45 అక్రమ వెంచర్లను గుర్తించి అందుకు బాధ్యులైన వెంచరుదారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కోట్లలో లాభాల రుచి మరిగిన వ్యాపారులు ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లు ప్లాట్లపైన మున్సిపల్ శాఖ దృష్టి సారించి అక్రమ లేఅవుట్‌ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా కఠిన నిబంధనలు అమలు చేసేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అక్రమంగా వెంచర్లు వేసినవారికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తుండడంతో ఆయా కాలనీ వాసుల నుండి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. రోడ్లు మురుగు కాలువలకు, సామాజిక అవసరాలకు కనీస స్థలాలు వదలడం లేదు. ఇలాంటి స్థలాల విషయమై కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని,కొనుగోలు, అమ్మకాలు జరగకుండా లావాదేవీలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ నేపద్యంలో సోమవారం తెల్లవారు జామునుంచి టౌన్ ప్లానింగ్ అధికారి బాల మద్దయ్య ఆధ్వర్యంలో సచివాలయం అధికారులు అక్రమ లేఅవుట్ల తొలంగింపు చర్యలు చేపట్టారు.సరిహద్దు రాళ్లను తొలగించారు.నంద్యాల రహదారి, నాగలూటి రోడ్డు, ఆత్మకూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, పగిడ్యాల రోడ్డు, కొణిదెల రోడ్డు పక్కన వెలసిన అక్రమ వెంచర్ల ను తొలగించారు.వెంచర్లలో ఎలాంటి పనులు చేయడానికి వీలులేదని రియలేస్టేట్ వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్థిరాస్తి వ్యాపారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా కమిషనర్ పి.కిషోర్ మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్లలో స్థలాల విక్రయాలు, కొనుగోలు చేయరాదని సూచించారు.ప్రజలు మోసపోవద్దన్నారు. డిటిసిపి అనుమతి పొందిన లేఅవుట్ల లొనే కొనుగోలు చేయాలని సూచించారు.

About Author