చట్టానికి ఎవరు అతీతులు కారు .. వైసిపి నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చట్టానికి ఎవరు అతీతులు కారని వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, సీనియర్ వైసీపీ నాయకుడు గొడిగెనూరు ఎంపీటీసీ పత్తి నారాయణ, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి ఇబ్రహీం , జిల్లా సేవాదళ్ మాజీ అధ్యక్షుడు చుండూరి వెంకటరమణ లు తెలిపారు. శనివారం చాగలమర్రిలోని వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులు అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అభాండాలు వేయడం తగదన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నదని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని వారు చాలెంజ్ చేశారు. ఆయన ప్రమేయము ఉన్నదని సిఐడి అధికారులు నిర్ధారించుకునే అరెస్టు చేయడం జరిగిందన్నారు . ఎలాంటి పెద్ద వ్యక్తులైన ఉన్నత పదవులలో ఉన్న తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసులు పెడతారని తెలుగుదేశం నాయకులు గ్రహించుకుంటే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు తెలుగుదేశం నాయకులు ఎంతో అవహేళన చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి జగనన్నను సైకో అనడం ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించడం తెలుగుదేశం నాయకులకు తగదు అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారికి ఎవరు మంచి చేస్తున్నారో జనానికి అన్ని తెలుసునని వైసిపి నాయకులు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారన్నారు. ముఖ్యమంత్రి జగనన్నకు దేవుని, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన ప్రయోజనం ఉండకూడదని వారు స్పష్టం చేశారు . సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా జగన్ మారుస్తున్నాడని విమర్శించిన చంద్రబాబు మా ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టి తమ ప్రభుత్వం వస్తే అమలు చేస్తానని ప్రజలకు వాగ్దానం చేయడం సిగ్గుచేటు అని వారు ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో జిడిపి రేట్ పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పదవిలో వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నో ఉపయోగకర చర్యలు చేపట్టారని వారు ప్రశంసించారు. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాల అమలులో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే భారతదేశం మొత్తం మీద అగ్రగామిగా నిలిచిందని వారు ప్రశంసించారు. ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ షేక్ సోహెల్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు గేట్ల మహబూబ్ సాబ్ , ఆ పార్టీ మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులున్నారు.