ఆర్ఎస్ఎస్ చీఫ్ గా బీసీ,ఎస్సీ,ఎస్టీలు ఎందుకు కాలేకపోతున్నారు ?
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య వివాదం ముదురుతోంది. పాఠ్యాంశాలను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు ధరించే చెడ్డీలను ఎన్ఎస్‌యూఐ తగులబెట్టింది. మేం కూడా చెడ్డీలను పంపిస్తాం కాల్చుకోండి అంటూ ఆరెస్సెస్ స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరెస్సెస్‌కు ఘాటు ప్రశ్నలు సంధించారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం వివాదానికి కారణమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ పదవిని ఓ దళితుడు లేదా ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి ఎందుకు అలంకరించలేకపోతున్నారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఆయన హుబ్లిలో మాట్లాడుతూ, ఆరెస్సెస్ నాన్ సెక్యులర్ ఆర్గనైజేషన్ అని తాను మొదటి నుంచి చెప్తున్నానని తెలిపారు. ‘‘ఓ దళితుడు, ఓబీసీ లేదా ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎప్పుడైనా సర్‌సంఘ్‌చాలక్ అయ్యారా? చెడ్డీలు అంతకన్నా ఏం చేయగలవు? వాళ్ళు చెడ్డీ పనులు మాత్రమే చేస్తారు. చెడ్డీలు చెడ్డీల పనే చేస్తాయి’’ అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తలు చెడ్డీలను సేకరిస్తున్న విషయంపై స్పందించాలని విలేకర్లు అడిగినపుడు సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.