జిల్లాలో బీసీవై పార్టీ విస్తృత పర్యటన
1 min read–పార్టీకి పెరుగుతున్న ఆదరణ
–జిల్లాలో కలియ తిరుగుతున్న ఆర్కే
–పార్టీలోకి పెరుగుతున్న వలసలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : బీసీవై పార్టీకి జిల్లాలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. బీసీవై పార్టీ శ్రేణులు ఈ మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేత రాచ కౌలుట్లయ్య యాదవ్ కలియ తిరుగుతున్నారు. జిల్లాలోని ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు తాలూకాలో కౌలుట్లయ్య విస్తృతంగా పర్యటిస్తూ, ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని బీసీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా మండలాల్లో సమావేశాలు కూడా నిర్వహించి, పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని కీలకమైన నేతలతో మంతనాలు జరిపి త్వరలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని వద్దకు వారిని పిలుచుకుని వెళ్లి బీసీవై పార్టీ కండువను కప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో బీసీవై పార్టీకి ఎనలేని ఆదరణ పెరుగుతుందని, రాష్ట్రంలో సాంప్రదాయంగా వస్తున్న రెండు పార్టీలపై ప్రజలు విసుగెత్తిపోయి, నేతలంతా బీసీవై పార్టీ వైపు చూస్తున్నారన్నారు. శ్రావణమాసం అనంతరం బిసివై పార్టీ వైపు వలసలు వెల్లువెత్తుతాయంటు జోష్యం పలికారు. పార్టీని స్థాపించి రెండు నెలలు కూడా గడవక ముందే కర్నూలు జిల్లాలో పార్టీ విశేష ఆదరణ పొందింది అని అన్నారు. దీంతో రెండు పార్టీల గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఇప్పటికే ఆలూరు పత్తికొండ, ఆదోని ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బీసీవై పార్టీ నుండి బలమైన బీసీ నేతలు రానున్న ఎన్నికల్లో బీసీవై పార్టీ నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో పెరుగుతున్న ఆదరణకు, వస్తున్న విశేష స్పందన పట్ల, తమ అధినేత సైతం త్వరలో కర్నూలు జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాచ కౌలుట్లయ్య యాదవ్ వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉపాధి లేక నిరుత్సాహంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం గా తమ అధినేత చేస్తున్న ప్రయత్నాలపై కూడా విస్తృత ప్రచారాన్ని అందించామన్నారు. రాష్ట్రంలో 600 కంపెనీలను ఆహ్వానించి 50000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా పార్టీ చేస్తున్న కృషిని కూడా పలువురు నేతలు అభినందిస్తు, ప్రశంసలు జల్లులు కురిపించారన్నారని తెలిపారు. ఇప్పటికే 85000 మంది నిరుద్యోగ యువత ఆన్ లైన్ ద్వారా తమ అప్లికేషన్లు పార్టీ కార్యాలయానికి పంపారన్నారు. తమ పార్టీకి గట్టి మేలు తలపెట్టే నైపుణ్యం ఉందన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేసే పార్టీ బీసీవై పార్టీ కాదని, ప్రజలకు అన్ని విధాలుగా అండదండలను అందించే పార్టీ బీసీవై పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.