చలమ రేంజ్ లో వన్యప్రాణులకు రక్షణ కరువు
1 min read
మహానంది , న్యూస్ నేడు: చలమ రేంజిలో వన్యప్రాణులకు రక్షణ కరువైనట్లు తెలుస్తుంది. గాజులపల్లె ,బసాపురం, పచ్చర్ల తదితర అటవీ సమీప గ్రామాల నుంచి కొందరు వేటగాళ్లు అటవీ ప్రాంతంలోనికి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడుతున్నట్లు సమాచారం. ఇటీవల బసాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో 2 వన్యప్రాణులను వేటాడి వధించిన అనంతరం వాటి మాంసాన్ని విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వన్య మృగాలు వేసవి కావడంతో నీటి కోసం నీటి కుంటల వైపు రావడం సహజం. దీనిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు వన్నె మృగాలను ఉచ్చులు మరియు ఇతర మార్గాల ద్వారా వేటాడి వధించి మాంస విక్రయాలు యదేచ్చగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దీనికంతటికి అటవీ శాఖలో పనిచేసే ఒక స్థాయి ఉద్యోగి మామూళ్ల మత్తులో పడి వేటగాళ్లకు వత్తాసు పలుకుతూ వారిని తమ వెంట వేసుకొని కాపాడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అటవీ శాఖలో పనిచేసే ఆ స్వామికి ముడుపులు చెల్లిస్తే అటవీ ప్రాంతంలో ఎలాంటి పని అయినా చేసుకొని వెళ్లడానికి అనుమతి ఉంటుంది అనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఆ స్వామి అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేయించి వేధిస్తారు అనే విమర్శలు వినవస్తున్నాయి. వెదురు ఇతర కలప తో పాటు వన్యప్రాణుల వేట వరకు అన్ని ఆ స్వామి కనుసనల్లోనే జరుగుతున్నాయని ఆరోపణలు ,విమర్శలు వెల్లువెత్తుతున్న అటవీశాఖ ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలమ రేంజిలో నిరంతరం అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేట జరుగుతున్న అటవీ శాఖ వర్గాలు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు అనేది నిర్వివాదాంశంగా మారినట్లు తెలుస్తుంది. వన్యప్రాణుల వేటకు నాటు తుపాకులు కూడా వేటగాళ్లు ఉపయోగిస్తున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఆ స్వామి కరుణాకటాక్షాలతో ఇదంతా జరుగుతున్నట్టు ప్రచారం. ఇటీవల బసాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు వన్య మృగాలను వేటాడిన అనంతరం వాటి మాంసాన్ని తీసుకొని పోయి విక్రయించారని, కానీ వాటి చర్మాన్ని అక్కడే వదిలేసి పోయారు అనే అంశం చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తుంది. ఆ స్వామి కరుణ కటాక్షం ఉన్నాయి కాబట్టే అక్కడ వదిలేసిన వన్యప్రాణి చర్మం అంశం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. అటవీ శాఖ గస్తీ… కుస్తీగా మారిందా లేక కులాసాగా చూస్తూ తమ జేబులు నింపుకొని తమ కడుపులు నిండాయని భావించి వన్నె మృగాల కడుపులు చీల్చి వాటి మాంసాన్ని క్రయ,విక్రయాలకు పాల్పడిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.