యువత భవిష్యత్ మారుస్తా..
1 min readఒక్క అవకాశం ఇవ్వండి..
- టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు, పల్లెవెలుగు: యువత భవిష్యత్తు మార్చేందుకు రానున్న ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ యువతను కోరారు. నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన యువకులు జె.ఎం బ్రదర్స్ ఆధ్వర్యంలో హనీఫ్ ఖాన్, తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం సత్యం గౌడ్ ఆధ్వర్యంలో బంగారుపేట యువకులు టిడిపిలో చేరారు. అనంతరం 49వ వార్డుకు చెందిన రామ్మూర్తి, కౌశిక్, ఉదయ్ ఆధ్వర్యంలో యువకులు టిడిపిలో చేరారు. మౌర్య ఇన్లో జరిగిన ఈ కార్యక్రమంలో టిజి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కర్నూలు ప్రజల కోసం తాను స్వయంగా 6 గ్యారెంటీలు రూపొందించినట్లు చెప్పారు. ఐదేళ్లలో వీటిని అమలుచేస్తానన్నారు. యువత కోసం ఫ్యాక్టరీలు తెస్తానని హామీ ఇచ్చారు. పెరిగిపోయిన నిత్యవసర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలు, పన్నులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ధరలు నియంత్రణలో ఉంటాయని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయకుండా సొంత రాష్ట్రంలోనే పని చేసుకునే పరిస్థితులు ఉంటాయన్నారు. యువత భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ ఇస్తుందన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లో ఉన్నానని టి.జి భరత్ తెలిపారు. అంతకుముందు 9, 11 వార్డులకు చెందిన పలువురు గౌస్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ గెలుపు కోసం కష్టపడతామన్నారు. పార్టీ చేరికల కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీటూ గోపి, తదితరులు పాల్గొన్నారు.