జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఈనెల 26, 27, 28 తేదీలలో భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ మహాసభలు రాజమండ్రిలో జరగనున్నాయని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎం.రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రం లోని తంగేడంచ గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26, 27, 28 తేదీలలో రాజమండ్రిలో జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈనెల 26వ తేదీ నాడు కార్మికుల ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందని 27, 28 తేదీలలో మహాసభలు జరుపుకొని జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.నూతన కార్యవర్గం ద్వారా మన రాష్ట్రంలో నిర్వీర్యం అవుతున్న సంక్షేమ బోర్డును కాపాడుకొనుట కొరకు, ప్రభుత్వాలు అవలంబిస్తున్న భవన నిర్మాణ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ దిశగా ఈ మహాసభలు జరుగుతున్నాయన్నారు. 26వ తేదీ జరిగే ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఎఐటియుసి పోరాట ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక చట్టం 1996 ను పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారా స్కీములను కార్మికులకు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న కార్మికుల క్లైములకు వెంటనే నిధులు మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారి మళ్లించిన వెల్ఫేర్ బోర్డు నిధులను వెంటనే బోర్డుకి జమా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు దివాకర్, సలీమ్, బాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.