PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవగాహనతో.. క్యాన్సర్​కు చెక్​ పెడదాం..

1 min read

డాక్టర్‌. సి.గోపీనాథ్‌ రెడ్డి,  క‌న్సల్టెంట్ ఇంట‌ర్నల్ మెడిసిన్‌, కిమ్స్ హాస్పిట‌ల్స్‌, క‌ర్నూలు

– ఫిబ్రవ‌రి 4న అంత‌ర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవ‌రి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.  కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ఈరోజును ప్రపంచ క్యాన్సర్ రోజుగా జరుపుకుంటున్నాం. ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది.

అవగాహన లేమితో… కుంగదీత..

రోజు రోజుకీ మనిషి జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్లు కొత్తకొత్త రోగాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. క్యాన్సర్ విషయంలో దాదాపు ఇదే జరుగుతోంది. ఈ రోగంకన్నా, దానిపై అవగాహన లేక ఏర్పడే భయం రోగిని కుంగదీస్తోంది. ఫలితంగా ప్రాణాలమీదకు వస్తోంది. చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, మెరుగైన జీవనశైలిని అలవర్చుకుని, మేలైన వైద్యచికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను ఎదుర్కోవడం సులభమేనని ఎందరో నిరూపించారు. ప్రస్తుత రోజుల్లో వయసుతో.. అలవాట్లతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారినపడుతున్నారు.

క్యాన్సర్ అంటే…

మనిషి శరీరంలోని కణజాలం, ఏ అవయవంలోనైనాసరే ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా హానికరమైన, అపరిమితంగా పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ సోకుతుందో దానికి ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతుంటాం. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దానిని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు విస్తరిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఇలా క్యాన్సర్ పెరగడాన్ని ‘మెటా స్టాసిస్’ అంటారు. క్యాన్సర్ అనేది దగ్గరి సంబంధం ఉన్న అనేక వ్యాధుల సముదాయం. ఇది శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాల్లో మొదలవుతుంది. ఈ కణాలు పెరిగి విభజన చెందుతాయి. శరీరానికి అవసరం లేకపోయినా, కొత్త కణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించాల్సిన సమయంలో క్షీణించవు, ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి మాదిరి ఏర్పడతాయి. దీనిని క్యాన్సర్ గడ్డ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ కంతులు అన్నీ అపాయమైనవి కావు.  క్యాన్సర్ లక్షణాలు దాని రకంపై ఆధారపడి ఉంటాయి. చిన్న పరిమాణపు క్యాన్సర్ లేదా ప్రాధమిక దశల్లో ఉన్నవాటికి చికిత్స చేయడం సులభం.మరోవైపు, మెటాస్టాటిక్ క్యాన్సర్ల పర్యవసానాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో క్యాన్సర్ వ్యాప్తిని పూర్తిగా నివారించలేము దీంతో అనేక శరీర వ్యవస్థల వైఫల్యాలు లేదా ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ఇంతే కాకుండా, రోగనిర్ధారణ కణితి రకాన్ని బట్టి మరియు ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి కూడా ఉంటుంది.

క్యాన్సర్ లక్షణాలు :

ముక్కు , నోటి నుంచి రక్తం కారడం, గడ్డలు ఏర్పడడం క్యాన్సర్ లక్షణాలు

రొమ్ము క్యాన్సర్: రొమ్ము ముద్ద, చనుమొన ద్రవం కార‌డం, చర్మంలో మార్పు.

ప్రేగు ల్లో బల్లలు ఏర్పడడం, పురీషనాళంలో నొప్పి.

ఊపిరితిత్తుల క్యాన్సర్, నిరంతర దగ్గు, కఫంలో రక్తము, ఛాతీ నొప్పి.

బ్రెయిన్ క్యాన్సర్: భరించలేని తలనొప్పి; వికారం, వాంతులు, అవయవాలలో బలహీనత.

కాన్సర్ కణజాలం యొక్క అంచనా ద్వారా క్యాన్సర్ దశలు నిర్దారించబడతాయి. ప్రాణాంతక కణితి గుర్తించిన తర్వాత, కణితి స్వభావాన్ని తెలుసుకోవడానికి మరియు చికిత్సా ప్రణాళికను అంచనా వేయడానికి ‘గ్రేడింగ్’ మరియు ‘స్టేజింగ్’ అనే రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. గ్రేడింగ్ అనేది హిస్టోలాజిక్, అంటే దీనిలో కణజాలం (టిష్యూ) మైక్రోస్కోప్ ద్వారా అధ్యయనం చేయబడుతుంది, అయితే స్టేజింగ్ అనేది వైద్యసంబంధమైనది మరియు సాధారణ పరీక్ష ద్వారా గుర్తించబడుతుంది.

క్యాన్సర్ కు చికిత్స :

క్యాన్సర్‌కు ప్రాధమికంగా రెండు రకాలుగా చేస్తారు. క్యాన్సర్ ను అదుపు చేయడానికి శస్త్రచికిత్సను చేస్తారు. సర్జరీ ద్వారా క్యాన్సర్ కణాల అసాధారణ పెరుగుదలను లేదా కణాల యొక్క గడ్డను తొలగించడం జరుగుతుంది, తర్వాత తొలగించిన భాగం యొక్క జీవాణుపరీక్ష ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కణితి పరిణామం బట్టి చేస్తారు. ఇక సర్జరీ లేకుండా క్యాన్సర్ కు కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ కు చికిత్సనందిస్తారు. దీనిలో ప్రాథమికంగా అసాధారణంగా పెరుగుతున్న కణాలను నాశనం చేయడానికి మందులను ఇస్తారు. మరొక చికిత్సా విధానం రేడియోథెరపీ, దీనిలో పెరుగుతున్న కణితి మీదకు గామా కిరణాలు వంటి రేడియేషన్లను ప్రసరిపచేస్తారు. కొన్నిసార్లు, పేషేంట్స్ పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స, శస్త్రచికిత్సకాని రెండు పద్దతులను ఉపయోగిస్తారు. మొదట, కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోథెరపీ లేదా కీమోథెరపీ ని ఉపయోగిస్తారు. అనంతరం క్యాన్సర్ కణితిని తొలగించదానికి శస్త్రచికిత్స చేస్తారు. ఇతర భాగాలకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నివారించడానికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ని మళ్ళీ ఆ ప్రాంతంలో నిర్వహిస్తారు.

మెరుగైన జీవనశైలితో…                         

క్యాన్సర్ ఉందనగానే భయపడడం సహజమే అయినా అది పరిష్కారం కాదు. వ్యాధి లక్షణాలు, తీవ్రత, చికిత్సపై సరైన అవగాహన చేసుకుని ధైర్యంగా ముందుకు వెళితే జీవితకాలం పెంచుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మేలైన జీవనశైలి ముఖ్యం. ఆ విషయాన్ని చాటడానికే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్యంతోపాటు ఇతరులనూ రక్షించినవాళ్లం అవుతాం.

About Author