ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
జనవరి 7న విశాఖలో బీసీ బహిరంగ సభ
విజయవాడ, పల్లెవెలుగు:దేశంలో బీసీలకు పట్టం కట్టేది… ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురందేశ్వరి. సోమవారం విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ బీసీలు సామాజికంగా.. రాజకీయంగా.. ఆర్థికంగా అణగబడుతున్నా రని, వారికి న్యాయం జరగాలంటే …ఏపీలో బీజేపీ జెండా ఎగరాలని ఉద్ఘాటించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీ, వైసీపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో బీసీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఇందుకు రాష్ట్రంలోని బీసీలు అందరు పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి మాట్లాడుతూ దేశ జనాభాలో అధికశాతం బీసీలు ఉన్నారని, కానీ ప్రాంతీయ పార్టీలు బీసీలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలలో కూడా మేధావులు, చదువుకున్న యువత అధికంగా ఉన్నారని, కానీ ఓటు బ్యాంకుగానే ప్రాంతీయ పార్టీలు చూడటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు పట్టం కట్టే బీజేపీని గెలిపించుకుందామని ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి పిలుపునిచ్చారు. అనంతరం జనవరి 7న విశాఖపట్నంలో చేపట్టనున్న బహిరంగ సభకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.