PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన్ కీ బాత్’ తో ప్రధాని ప్రజలతో మమేకం!!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రతి నెల చివరి ఆదివారం రోజున రేడియో ద్వారా నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం దేశ ప్రజలతో మమేకం అయ్యేలా చేస్తుందని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా, నగరంలోని కోడుమూరు రోడ్డున ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని విన్నారు. అనంతరం రేడియే స్టేషన్ పరిశీలించి, ఏయే బూత్ లో ఏమేం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి 2014 అక్టోబర్ 3న ప్రారంభించిన ‘మన్ కీ బాత్’ దిగ్విజయంగా సాగుందని, ఇది దేశ నెలవారి సమీక్షగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి దేశ ప్రజలతో ఆయనకు ఎదురైనా సవాళ్ళను, అద్భుతమైన విషయాలు, అరుదైన అనుభూతులు, జీవిత ఆటుపోట్లు పంచుకుంటూ యువతకు స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రజల శక్తి సామర్థ్యాలు, సాహసం, శౌర్యం, స్ఫూర్తిదాయక గాథలు చెబుతూ అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని కొనియాడారు. సాహిత్యం, విద్య, శాస్త్రీయ దృక్పథం, మన కుటీర పరిశ్రమలు, సాంకేతిక రంగాల అంశాలను ప్రతి నెలా ప్రధాని చర్చించడం హర్షించదగ్గ విషయమన్నారు. మన దేశంలోనే కాకుండా 11 విదేశీ భాషల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతూ ప్రపంచవ్యాప్తంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. రేడియో ఒకప్పుడు ప్రజలకు సమాచారం చేరవేయడంలో కీలకపాత్ర పోషించేదని, కానీ ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక వినియోగంతో రేడియోకి ప్రాధాన్యత తగ్గిపోయిందని, కానీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ తో రేడియోకి ఎంతో ప్రాచుర్యం పొందుతుందన్నారు.కార్యక్రమంలో వైయస్ఆర్ సిపి నాయకులు కృష్ణచైతన్య, టి.వి. సుబ్బారెడ్డి, ప్రముఖులు చంద్రశేఖర కల్కూర, గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కొట్టే చెన్నయ్య , లెక్చరర్స్ బడే సాహెబ్, శ్రీనివాసులు, మల్లికార్జున, రేడియేషన్ అధికారులు పాల్గొన్నారు.

About Author