సాంకేతికతతో… నేరాల పై నిఘా…ఎస్పీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సాంకేతిక ఆధారంగా నేరాల కట్టడి పై దృష్టి పెట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు. ఈ సంధర్బంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆఫీసు నుండి కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించనున్న డ్రోన్ కెమెరా పనితీరు ను కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ లో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పరిశీలించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ తో నేరాలను నియంత్రించడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్ కెమెరా గురించి…ఈ డ్రోన్ కెమెరా చెన్నై మార్స్ ఎయిరో( ఓపిసి) ప్రవేట్ లిమిటెడ్ కు చెందినది.శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణ, వివిధ బందోబస్తులు, బహిరంగ సభలు, జాతరలు/ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం , క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, సెన్సిటివ్/హాట్స్పాట్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించుటకు, వరదలు, భూకంపాల వంటి విపత్తు సమయాలలో రెస్క్యూ & సహాయక చర్యలు చేపట్టుట, అనుమానితులను గుర్తించడం, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు , పండుగలు, ఉత్సవాలు, కర్ఫ్యూ లు, అత్యవసర సమయాలలో 5 కిలోమీటర్ల వరకు ఈ డ్రోన్ ప్రయాణించగలదు. నాటుసారా తయారీ, పేకాట స్థావరాలు, బహిరంగ/పబ్లిక్ ప్రదేశాల్లో అనుమానితులను, నగర శివారులలో చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై , రాత్రి సమయాలలో వాహనాల నెంబర్ల ను కూడా నైట్ విజన్ కెమెరాతో పర్యవేక్షిస్తుంది.వరదలు, రెస్య్కూ సమయాలలో పే లోడ్ టెక్నాలజీ తో బాధితులకు సహాయం అందించడానికి 5 కేజిల ఫుడ్ గానీ లేదా మెడికల్ వస్తువులు గానీ తీసుకెళ్ళగలదు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ డిస్పీ రమణ, స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్ , ఇతర అధికారులు ఉన్నారు.