మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి… టి.జి భరత్
1 min readబుధవారపేటలో పబ్లిక్ టాయిలెట్స్ వద్ద సెప్టిక్ ట్యాంకులో పడి చనిపోయిన మహిళ
సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన టి.జి భరత్
బాదితురాలి కుటుంబానికి రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో బహిర్భూమికి వెళ్లి లక్ష్మి (30) అనే మహిళ మృతి చెందింది. సంఘటన స్థలానికి టి.జి భరత్ వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల ప్రాంగణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడి మహిళ చనిపోయారన్నారు. సెప్టిక్ ట్యాంక్ మూసివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మహిళ మృతికి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు తక్షణమే రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. గతంలో ఇక్కడే బాలుడు చనిపోయారని.. అయినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో మరొకరి ప్రాణాలు పోయాయన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని ఆయన అన్నారు. నగరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వద్ద పరిశుభ్రతతో పాటు సరైన సదుపాయాలు తప్పక కల్పించాలని భరత్ కోరారు. సెప్టిక్ ట్యాంక్‌లను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పోరేటర్ విజయకుమారి, మాజీ కార్పోరేటర్లు రామాంజనేయులు, పామన్న, తదితరులు పాల్గొన్నారు.