మహిళలు సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగిఉండాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కుటుంబాభివృద్ధితోపాటు దేశాభివృద్ధిలో మహిళలపాత్ర ఎంతో గొప్పదని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగంవారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ సెమినార్ హాల్లో ఈ రోజు నిర్వహించిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న విజయాలతోపాటు అందుకోవలసిన లక్ష్యాలను మదింపు చేసుకోవడానికి ఈ వేడుకలు ఒక గొప్ప అవకాశమన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న మహిళలు స్వీయ విషయాలతోపాటు సామాజిక అంశాల పట్లకూడా అవగాహన కలిగిఉండాల్సిన అవసరముందని ఆచార్య బసవరావు పిలుపునిచ్చారు. మహిళాసాధికారతకు చదువును మించిన సాధనంలేదని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది నాగలక్ష్మీదేవి అభిప్రాయపడ్డారు. మహిళలకు ఎదురయ్యే సమస్యలకు న్యాయపరంగా అందే పరిష్కారాలపట్ల అవగాహన కల్పించారు. మనోధైర్యంలో స్త్రీ పురుషుడికన్నా ఎన్నోరెట్లు శక్తివంతురాలని కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సైకాలజిస్ట్ పి. శ్రీవిద్య సోదాహరణంగా వివరించారు. మనో నిబ్బరంతో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొనే శక్తి మహిళలకే సొంతమన్నారు. సమాజ పురోగతికి తల్లిఒడే ప్రథమ బడి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్కుమార్ నాయుడు, వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డితోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.