సెయింట్ ఆన్స్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు
1 min read– ఈ కాలేజీలో చదువుకున్న విద్యతో, అనుభవంతో వ్యాపారవేత్తగా ఎదిగాను
వ్యాపారవేత్త దీప్తి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: మహిళా సాధికారతను సాధించాలంటే కేవలం నైపుణ్యం, సరైన ప్రణాళిక, ఆర్థిక వనరులు మాత్రమే సరిపోవని వాటితో పాటుగా ధైర్యం, విశ్వాసం సహనం లాంటివన్నీ కూడా అవసరమేనని దీప్తి అన్నారు. స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో దీప్తి. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో తాను ఈ సెయింట్ తెరాసా కళాశాల పూర్వ విద్యార్థిని అని, అలాగే సుమారు 10 సంవత్సరాలు ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేశానని. తెలియజేశారు. ఈ కళాశాలలో నేర్చుకున్న విద్య తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని, ఇక్కడ పనిచేసిన అనుభవం తనను వ్యాపారవేత్తగా ఎదిగేలా ప్రోత్సహించిందని తెలియజేశారు. ఆమె ప్రస్తుతం లగ్జరీ బొటిక్ అనే వ్యాపార సంస్థ ద్వారా సుమారు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. దీప్తి తన ప్రసంగంలో తాను చేసే పనిని ప్రేమించాలని, ప్రమాదాలను ఎదుర్కోవడానికి భయ పడకూడదని విద్యార్థినులకు సందేశాన్ని ఇచ్చారు.మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఆయుష్ హాస్పిటల్స్ లో గైనకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రమ్య యుక్త వయసులో ఉన్న స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చేటు వంటి వ్యాధులు, వాటి కారణాలను గురించి వివరించారు. పాలిస్టిక్ ఓవరి సిండ్రోమ్ కారణంగా మహిళలలో సంతానలేమి. గర్భవిచ్చితి మొదలైనవి జరుగుతాయని, దానికి ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఆనవంశికత కారణాలుని తెలియజేశారు. ప్రతి మహిళ 35 సంవత్సరాల వయస్సు తర్వాత స్త్రీల వైద్యులను తప్పని సరిగా సంప్రదించి తగిన సలహాలు సూచనలతో ఈ సమస్యను అధిగమించవచ్చని అన్నారు.విమెన్ సెల్ కార్యదర్శి శ్రీమతి పద్మలత గత సంవత్సరం విమెన్ సెల్ రిపోర్టును సభకు వినిపించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ నేటి తరం మహిళలు అన్ని విభాగాలలోనూ ముందుండి సాధికార మహిళలుగా నిరూపించుకుంటున్నారు. అలాంటి తరుణంలో స్త్రీల సమస్యలను గురించి మౌనంగా ఉండడం తగదన్నారు. మహిళలను వారి అందాన్ని బట్టి కాకుండా, వారి సామర్ధ్యాన్ని బట్టి గౌరవించాలన్నారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు సమాన హక్కులపై పోరాటం చేస్తున్నారే తప్ప, ఆదిపత్యం కోసం కాదన్నారు.అనంతరం ఆయుష్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ శ్రీహర్షలు కిడ్నీలు మరియు మూత్ర నాళ సంబంధిత వ్యాధులను గురించి వివరించారు. సాధారణంగా పెద్దవారిలో వచ్చే ఈ వ్యాధులు ప్రాణాంతకం కాదని, కానీ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అడ్డంకులేనని వివరించారు. ఈరోజు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం అని తెలియజేశారు. వైద్యుల సలహాలు,మందుల వాడకం ద్వారా ఈ వ్యాధిని అదుపులో నుంచుకోవచ్చునని సూచించారు. ఈ కళాశాలలో ని విమెన్ సెల్ విభాగం, తెలుగు హిందీ విభాగం, ఎన్ఎస్ఎస్ మరియు ఉన్నత అభియాన్ విభాగాలలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రజిత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్సిస్టర్ సుశీల, ఇతర విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.