సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం “నవోదయం 2.0” పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని…. ఈ మేరకు నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ రవికుమార్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాటు సారాను అరికట్టేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ రవికుమార్ మాట్లాడుతూ నాటు సారా తయారీ చేసే వ్యక్తులు, తరలించే వారు, విక్రయించే వారిని గుర్తించి వివరాలు సేకరించేందుకు గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, రెవెన్యూ అటవీ ఎక్సైజ్ అధికారులతో పాటు సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసామన్నారు. ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిపై బైండోవర్ నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నాటు సారా రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగా నవోదయం 2.0 పోస్టర్ ను కలెక్టర్, జెసిలు ఆవిష్కరించారు.