‘ఆధార్’ లోటుపాట్ల సవరణ పై వర్క్ షాప్..
1 min read– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు, వెబ్ కర్నూల : ప్రస్తుత పరిస్థితులలో ఆధార్ ప్రతి ఒక్కరికి తప్పనిసరని, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ లో లోటుపాట్ల సవరణలకు సంబంధించి నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు.కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన 186 మంది డిజిటల్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, మీసేవ ఆపరేటర్లకు ఆధార్ లోటుపాట్ల సవరణల పై నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కొత్తగా నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ ఫోన్ అప్డేట్, అడ్రస్, పేరు మార్పు, ఈమెయిల్ అడ్రస్ మార్పు తదితర సవరణలకు సంబంధించి న సేవలను గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు..గత మూడు సంవత్సరాల కాలంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలని, ఆధార్ లో వున్న లోటుపాట్ల వలన అక్కడక్కడ పొరపాట్లు జరిగి అర్హత ఉన్న వారు లబ్ధి పొందక, అర్హత లేని వారికి అందడం జరుగుతుందన్నారు.. ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఆధార్ లోని సవరణల కోసం వచ్చిన వారి నుండి పూర్తి వివరాలు సేకరించి, ఆధార్ లో వున్న లోటు పాట్లు సరిచేయాలని శిక్షణ లో పాల్గొన్న సిబ్బందికి కలెక్టర్ సూచించారు .. ఆధార్ లో ఎటువంటి సవరణలు సరి చేయడంలో సందేహాలు, సాంకేతిక సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ పొందాలని కలెక్టర్ సూచించారు.. అలాగే గ్రామ, వార్డ్ , వార్డ్ సచివాలయాల ద్వారా ఆధార్ లో సవరణలకు సంబంధించిన సేవలు అందుతాయన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు.. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ వర్క్ షాప్ లో జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి,రాష్ట్ర స్థాయి నుండి ఆధార్ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ జావిద్, గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర సమన్వయకర్త విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.