అంతర్జాతీయ ఆస్థమా దినోత్సవం…
1 min read
డా. పొట్టి వెంకట చలమయ్య
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్,
కిమ్స్ హాస్పిటల్, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు:ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారం నాడు అంతర్జాతీయ ఆస్థమా దినోత్సవాన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్థమా (GINA) నిర్వహిస్తుంది. ఆస్థమా అనేది శ్వాస మార్గాలు దెబ్బతినడం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. దీనిలో ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం రావడం మరియు ఊపిరి ముడుచుకునే శబ్దం (వీజింగ్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు రాత్రిళ్లు మరియు చలికాలంలో ఎక్కువ అవుతాయి.
ఈ సంవత్సరం అంతర్జాతీయ ఆస్థమా దినోత్సవం సందర్భంగా “ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయండి” థీమ్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ థీమ్ ద్వారా, ఆస్థమా ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఇన్హేల్డ్ మందులను అందుబాటులోకి తీసుకురావడం అవసరమని హైలైట్ చేస్తున్నారు. ఇది వ్యాధిని నియంత్రించడంలో మరియు తీవ్రమైన ఇబ్బందులను నివారించడంలో సహాయపడుతుంది.
అంతర్జాతీయంగా ఆస్థమా ప్రభాల్యం:
ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ల మందికి పైగా ఆస్థమాతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 4.5 లక్షల మందికి పైగా ఆస్థమా వల్ల మరణిస్తున్నారు. పిల్లలలో ఇది అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధి (సుమారు 15%).
భారతదేశంలో ఆస్తమా :
భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది ఆస్థమా వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంతర్జాతీయ ఆస్థమా కేసులలో భారత్ వాటా 13% మాత్రమే అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆస్థమా మరణాలలో మనదేశం వాటా 42-46% ఉంది — ఇది చాలా ఆందోళనకరం.
ఈ మరణాలు సంభవించడానికి కారణాలు:
– ఆస్తమా లక్షణాలను సరైన విధంగా గుర్తించకపోవడం మరియు నిర్ధారించకపోవడం
– ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్లను సరైన విధంగా ఉపయోగించకపోవడం
– చికిత్స పద్ధతులకు అనుసరణ లేకపోవడం
– మౌఖిక మందులపై ఎక్కువ ఆధారపడటం
– గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడం
– గాలి కాలుష్యం – ఇది ఆస్థమా తీవ్రతను పెంచే ప్రధాన కారణం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– విజ్ఞానాన్ని పెంపొందించటం, లక్షణాలు, చికిత్స మరియు ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం
– సరైన రోగ నిర్ధారణ & చికిత్స
ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ల సరైన వినియోగం, ప్రతి పేషెంట్‌కి ఇన్హేలర్ వాడే పద్ధతిని పర్యవేక్షించడం
పల్మనరీ ఫంక్షన్ టెస్టులు – వ్యాధి తీవ్రత అంచనా వేయడంలో ఉపయోగపడతాయి
అలర్జీ టెస్టులు – కారణమైన అలర్జన్‌ను గుర్తించడంలో సహాయపడతాయి
– గాలి కాలుష్యాన్ని తగ్గించడంపై చర్యలు
– మాస్క్ వాడకం, చల్లని గాలికి దూరంగా ఉండటం, శుభ్రత పాటించడం
– టీకాలు – ప్న్యుమోకాకల్ మరియు ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.